Begin typing your search above and press return to search.

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు... పూజలకు హిందువులకు అనుమతి!

ఇందులో భాగంగా... ఈ ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసి ఉన్న బేస్‌ మెంట్‌ లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 12:38 PM GMT
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు...  పూజలకు హిందువులకు అనుమతి!
X

అయోధ్యలో రామందిర నిర్మాణం, బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం జ్ఞానవాపికి సంబంధించిన చర్చ ప్రముఖంగా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసిలో గల వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వారణాసి కోర్టు కీలక అనుమతులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... వారణాసిలో గల వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఈ ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసి ఉన్న బేస్‌ మెంట్‌ లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. దీనికి అనుగుణంగా వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని, పూజలు చేసుకునేందుకు బారికేడ్లు తొలగించాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా... కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో పూజలు చేయించాలని కోర్టు సూచించినట్లు హిందూ మహిళల తరఫు న్యాయవాది వెల్లడించారు.

కాగా... ఉత్తరప్రదేశ్‌ లో వారణాసిలో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులను పూజించడానికి అనుమతివ్వాలంటూ కొందరు మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీంతో.. ఈ విషయంపై గతంలో విచారణ జరిపిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది.

ఇదే నేపథ్యంలో... సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా మినహా.. మిగతా మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌, ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం (ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) సర్వే చేసింది. దీంతో ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయని... అందులో భాగంగా మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు నివేదిక పేర్కొందని వెల్లడించారు.

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ లో విష్ణుమూర్తి, హనుమాన్ విగ్రహాలు!:

ఇటీవల వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన ఏ.ఎస్.ఐ. ఇటీవల వెల్లడించింది! వాటిలో... విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి క్రీస్తు శకం 5 - 14 శతాబ్ధం మధ్యకాలానికి చెందినవి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

జ్ఞానవాపి మసీదు గోడలపై తెలుగు శాసనాలు!:

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై మూడు తెలుగు శాసనాలను మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం గుర్తించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఏ.ఎస్.ఐ. డైరెక్టర్ మునిరత్నం నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న మూడు శాసనాలతో పాటు సుమారు 34 శాసనాలను గుర్తించి తమ నివేదికలో సమర్పించిందని తెలిస్తుంది.

ఈ నేపథ్యంలో ఆ 33 శాసనాలనూ విడదీసి.. కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించారని అంటున్నారు. ఇవి దేవనగరి, తెలుగు, గ్రంథ, కన్నడ లిపులలో ఉన్నాయని చెబుతున్నారు. వీటిలో 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్ల కుమారుడు మల్లన భట్లు వంటి వారి పేర్లు ఉన్నట్లు మునిరత్నం స్పష్టం చేశారు!