ఫస్ట్ దేవేంద్ర ప్రధాన్.. నెక్ట్స్ జ్ఞానేశ్ కుమార్? కేంద్రంలో ప్రమాద ఘంటికలు!
జాతీయ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా విపక్షాలు, సీజేపీ ప్రతినిధులు పట్టు బిగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 3 Oct 2026 6:16 PM ISTజాతీయ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా విపక్షాలు, సీజేపీ ప్రతినిధులు పట్టు బిగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎన్నికల సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కాక్రోచ్ జనతా పార్టీ సైతం ఇదే డిమాండ్ తో సొంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే సీజేపీ ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విద్యామంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో ఉద్యమం చేపట్టేందుకు విపక్షాలు సిద్ధమవడంతో తదుపరి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సివస్తోందా? అన్నదే హాట్ టాపిక్ అవుతోందని అంటున్నారు.
సీఈసీ రాజీనామాకు పట్టు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు చేపడుతున్న ఆందోళనలు కాకరేపుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సొంతంగా ధర్నాలు నిర్వహించగా, రెండు రోజుల క్రితం ఇతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. దీంతో ఢిల్లీలో ఆప్ ఆధ్వర్నంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ కార్యకర్తలు కదం తొక్కారు. తక్షణం జ్ఞానేశ్ కుమార్ తప్పుకోకుంటే, జంతర్ మంతర్ 2.0కి శ్రీకారం చుడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది.
సీజేపీ ఎఫెక్ట్ పై భయం?
కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువతను సంఘటితం కావడం దేశ రాజకీయాలను మలుపు తిప్పుతోందని అంటున్నారు. ప్రధానంగా గత వేసవిలో విద్యాశాఖ లోపాలను ఎత్తిచూపుతూ సీజేపీ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద వినూత్న నిరసనలతో దేశం దృష్టిని ఆకర్షించిన జెన్ జీ యువత కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా భావించిన కేంద్ర పెద్దలు కూడా మెట్టు దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు. సీజేపీ దెబ్బకు విద్యామంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు కేంద్రం సిద్ధమైందని చెబుతున్నారు. ఇప్పుడు తమకు ఓటు హక్కు దూరం చేస్తున్నారనే ఆగ్రహంతో అదే జెన్ జీ యువత మరోసారి సంఘటితం కావడం, జంతర్ మంతర్ 2.0 చూపిస్తామని హెచ్చరిస్తుండటం కలకలం రేపుతోందని చెబుతున్నారు.
తలనొప్పులు తప్పవా..
విపక్షాలు, సీజేపీ కార్యకర్తలు ఉద్యమంతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయా? అన్నదే ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలపై లిఖిత పూర్వక అభ్యంతరాలు నమోదు చేయడం, ఆ విషయాలు బయటకు రావడంతో ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. ఈ విషయంలో కేంద్రంతోపాటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను విపక్షాలు లక్ష్యంగా చేసుకోవడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా ప్రస్తుత పరిస్థితులు దారితీస్తాయా? లేక విపక్షాలను శాంతింపజేసేలా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది తేల్చుకోలేకపోతోందని అంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నట్లుగా సీఈసీకి రాజ్యంగం రక్షణ కల్పించిందని, ఆ పదవి నుంచి తొలగించడం అంటే కేంద్రం చేతుల్లో లేదని అంటున్నారు. అదే సమయంలో విపక్షాలు కూడా ఈ విషయంలో పైచేయి సాధించాలంటే ముందుగా పార్లమెంటులో బలం నిరూపించుకోవాల్సివుందని అంటున్నారు. దీంతో ఈ విషయంలో జ్ఞానేశ్ కుమార్ నిర్ణయం కూడా ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు.
