Begin typing your search above and press return to search.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన...తేలిపోయింది !

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానం నోటీసు తిరస్కారానికి గురి అయింది

By:  Satya P   |   7 April 2026 6:00 AM IST
సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన...తేలిపోయింది !
X

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానం నోటీసు తిరస్కారానికి గురి అయింది. దీనికి సంబంధించి ఉభయ సభలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సీఈసీ మీద ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు పూర్తిగా తిరస్కరించారు. దాంతో గత కొద్ది రోజులుగా ఈ విషయం మీద నెలకొన్న ఉత్కంఠకు తెర దించినట్లు అయింది.

అన్నీ పరిశీలించిన మీదట:

ఇక విపక్షాలు అన్నీ కలిసి లోక్ సభ రాజ్యసభలో మొత్తం 193 మందికి పైగా ఎంపీలతో సంతకాలు చేయించి సీఈసీ మీద అభిశంసన కోరుతూ తీర్మానం నోటీసుని ఈ మధ్యనే ఉభయ సభలకు అందచేశాయి. అయితే ఈ తీర్మాన నోటీసును క్షుణ్ణంగా పరిశీలించిన మీదట అందులో ఇమిడి ఉన్న అన్ని సంబంధిత అంశాలు సమస్యలను జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా అంచనా వేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. రాజ్యసభ ఛైర్మన్ లోక్‌సభ స్పీకర్ ఆ తీర్మాన నోటీసును స్వీకరించడానికి నిరాకరించారని రాజ్యసభ సచివాలయం లోక్‌సభ సచివాలయం వేర్వేరు ప్రకటనలలో దీని మీద వెల్లడించాయి.

ఏకపక్షంగానే అంటూ :

ఇక సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ మీద విపక్షాలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నాయని అంటే ఆయన పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నాయి. ఆయన పూర్తిగా పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారు అని ఆరోపిస్తూ విపక్షాలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అందుకే జ్ఞానేష్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ప్రతిపక్షం లోక్‌సభ రాజ్యసభ రెండింటిలోనూ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీసులు దాఖలు చేయడం జరిగింది. ఇలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీద ఈ తరహా తీర్మానం నోటీసులు ఇవ్వడం ఇదే మొదటిసారి.

విపక్షం ఏమంటుంది :

దేశానికి అత్యున్నత చట్ట సభ పార్లమెంట్. అక్కడే విషయం తేల్చుకుందామని విపక్షాలు ఈ విధంగా తీర్మానం ఇచ్చాయి. కానీ అది సభ ముందుకు రాకుండానే వీగిపోయింది. లోక్ సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ దీని మీద తమ విచక్షణాధికారం ఉపయోగించి ఈ విధంగా నోటీసుని తిరస్కరించారు. మరి విపక్షాలు దీని మీద ఏమంటాయి అన్నది ఇపుడు అంతా చూస్తున్నారు. ఈ విషయంలో ప్రజా క్షేత్రంలోనే వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు అని అంటున్నారు. నిజానికి ఉభయ సభలలో దీని మీద చర్చ జరిగినా ఓటింగ్ అంతా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికే అనుకూలంగా ఉంది. అయితే ఈ చర్చను పెట్టించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుని అత్యున్నత చట్ట సభల వేదిక ద్వారా ఎండగడదామని వ్యూహ రచన చేశాయని అంటున్నాయి. కానీ అది మొదటికే వీగిపోయింది అని అంటున్నారు. దాంతో సీఈసీ మీద ఇక జనంలోనూ మీడియా ముందు విమర్శలు చేయడమే తప్ప మరో మార్గం లేదని అంటున్నారు.