జీవీఎంసీపై కూటమి జెండా రెపరెప!
జీవీఎంసీ.. గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్ పూర్తిగా కూటమి పార్టీలకు హస్తగతమైంది.
By: Tupaki Desk | 26 April 2025 8:16 AMజీవీఎంసీ.. గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్ పూర్తిగా కూటమి పార్టీలకు హస్తగతమైంది. ఇటీవల వైసీపీ నాయకురాలు, జీవీఎంసీ మేయర్ వెంకట హరి కుమారిపై అవిశ్వాసం పెట్టిన కూటమి పార్టీలు.. దీనిని నెగ్గించుకున్నాయి. దీంతో ఆమె పదవీచ్యుతురాలైంది. ఇక, మరో కీలక ఘట్టం మిగిలిన నేపథ్యంలో తాజాగా అది కూడా పూర్తి చేసుకుని.. జీవీఎంసీపై కూటమి జెండాను రెపరెపలాడించింది. మేయర్‌పై అవిశ్వాసం పెట్టిన దరిమిలా.. డిప్యూటీ మేయర్‌ను కూడా అదే పద్ధతిలో దింపేయాల్సి ఉంది.
ఈ క్రమంలో వైసీపీ నాయకుడు, డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్‌పై తాజాగా శనివారం.. ఉదయం సభ్యులు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 74 మంది సభ్యులు(కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు) అనుకూలంగా ఓటేశారు. కార్పొరేషన్‌లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండగా.. వైసీపీ నుంచి 23 మంది బయటకు వచ్చారు. వీరు కూటమి పార్టీలకు జై కొట్టారు. మిగిలిన వారు..అసలు కౌన్సిల్‌కు కూడా రాలేదు.
ఈ క్రమంలో వచ్చిన 74 మంది డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఆయ న తన పదవిని కోల్పోయారు. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు సహా కౌన్సిల్ మొత్తం కూటమి పార్టీల చేతికి చిక్కింది. అయితే.. కొత్తగా మేయర్ డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునేందుకు 15 రోజలు నుంచి 30 రోజుల వరకు గడువు ఉంటుంది. ఇదిలావుంటే.. మేయర్ పదవిని టీడీపీ నేతకు కేటాయించగా.. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు.
చాలా కీలకం!
జీవీఎంసీపై కూటమి జెండా ఎగరడం.. ఇప్పుడున్న పరిస్థితిలో అత్యంత కీలకమని నాయకులు చెబుతు న్నారు. కూటమి ప్రభుత్వం విశాఖలో పలు కంపెనీలకు భూములు కేటాయించి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. వీటికి సంబంధించిన అనుమతులకు జీవీఎంసీ కూడా ఓకేచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వైసీపీ ఆధిపత్యం ప్రదర్శించడంతో భూముల కేటాయింపు సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి పాలన రావడంతో పనులు చకచకా జరగడంతోపాటు.. పెట్టుబడులు కూడా త్వరగా వస్తాయని నాయకులు చెబుతున్నారు.