బృహత్ విశాఖగా జీవీఎంసీ .కూటమి ఫోకస్
120 వార్డులుగా జీవీఎంసీ విస్తరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లు మునిసిపాలిటీలు స్థానిక సంస్థలలో సీట్లను పెంచనుంది.
By: Satya P | 30 March 2026 2:00 PM IST120 వార్డులుగా జీవీఎంసీ విస్తరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లు మునిసిపాలిటీలు స్థానిక సంస్థలలో సీట్లను పెంచనుంది. జనాభాకు తగిన విధంగా ఒక ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహా విశాఖ నగర పాలక సంస్థ ఏపీలోనే అతి పెద్ద కార్పోరేషన్ గా అవతరించనుంది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఈ సంఖ్య పెంచారు. అంతకు ముందు 2005లో జీవీఎంసీ ఏర్పాటు అయినపుడుఇ 73 వార్డులు ఉండేవి. ఇక 1979లో విశాఖ కార్పోరేషన్ గా తొలిసారి ఆవిర్భవించినపుడు కేవలం యాభై వార్డులే ఉండేవి. ఇపుడు మూడింతలు పెంచుకుంటూ జీవీఎంసీ ముందుకు సాగడమే కాదు మరిన్ని మండలాలను గ్రామ పంచాయతీలను విలీనం చేసుకుని బృహత్ విశాఖగా ఈ కార్పోరేషన్ ని తీర్చిదిద్దాలని ఏపీలో కూటమి ప్రభుత్వం చూస్తోంది.
ఇవే కారణాలుగా :
విశాఖ ఉత్తరాంధ్రాకు ముఖ ద్వారంగా ఉంది. అంతే కాదు నానాటికీ ఎదుగుతోంది. విశాఖ మూడు జిల్లాలుగా మారింది. ఇక మైదాన ప్రాంతంలో అనకాపల్లి విశాఖ జిల్లాలు ఏర్పడ్డాయి. ఇపుడు అనకాపల్లి పరిసర ప్రాంతాలలఒ పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రగతి కనిపిస్తోంది. దాంతో ఆయా ప్రాంతాలను జీవీఎంసీలో విలీనం చేసుకోవడం ద్వారా మరింతగా సిటీ లుక్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు. అదే సమయంలో అక్కడ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ విస్తరణ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. దాంతో విశాఖ కార్పోరేషన్ని ఇటు భీమిలీ నియోజకవర్గంలో పద్మనాభం మండలం దాకా అటు పెందుర్తి దాకా మరో వైపు ఎలమంచిలి దాకా కూడా విస్తరించాలని చూస్తున్నారు.
విలీనంతోనే ప్రగతి :
గ్రామ పంచాయతీలను కార్పోరేషన్ లో విలీనం చేయడం ద్వారా అక్కడ కూడా అభివృద్ధి వేగంగా జరపాలని ప్రభుత్వం చూస్తోంది. ఆనందపురం మండలంలో దేశంలోనే అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది. దాంతో ఆ ప్రాంతాన్ని జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రతిపాదిస్తున్నారు. తద్వారా డేటా సెంటర్ కి అవసరం అయ్యే నీరు విద్యుత్ ఇతర సదుపాయాల కల్పన సులువు అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో భీమిలీ నియోజకవర్గంలో ఉన్న పద్మనాభం, ఆనందపురం మండలాలలోని పలు గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దీంతో జీవీఎంసీ వార్డులు ఏకంగా 150 దాకా పెరిగే అవకశాలు ఉంటాయని అన్|టారు.
కొత్త వారికి అవకాశాలు :
జీవీఎంసీలో మరిన్ని వార్డులు ఏర్పాటుతో కొత్త వారికి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అదే విధంగా ఇప్పటిదాకా చూస్తే ఇరవై వేల నుంచి ముప్పై వేల మందికి ఒక వార్డు ఉండేది. దానికి కనీసంగా పదిహేను వేల నుంచి 20 వేల మధ్యన జనాభా ఉండేలా సర్దుతారు అని అంటున్నారు. దాంతో పాలనాపరంగా మరింత సౌలభ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిన్నటిదాకా కార్పోరేటర్లుగా ఉన్న తాజా మాజీలతో పాటుగా రాజకీయంగా అవకాశాలు రాని వారికి కూడా ఈ పెరుగుదల వల్ల లాభం చేకూరుతుంది అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో అభివృద్ధి :
అయితే జీవీఎంసీలో పెరగనున్న 120 వార్డులతో ఎన్నికలు జరిపిస్తారా లేక మరిన్ని మండలాలను కలుపుకుని ఆ మీదట 120 వార్డులతో ఎన్నికలు పెడతారా అన్న చర్చ సాగుతోంది. మండలాల విలీనం అంటే అది అతి పెద్ద కసరత్తుగా ఉంటుంది. దాంతో ఎన్నికలు పెట్టేందుకు మరింత ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్రాలో ఇపుడు అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చింది. డేటా సెంటర్ తో పాటు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ సైతం నిర్మాణం అవుతుంది. దాంతో బృహత్ విశాఖగా కార్పోరేషన్ ని తీర్చిదిద్దితేనే మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సులువు అవుతుందని భావిస్తున్నారు.
