Begin typing your search above and press return to search.

జీవీఎంసీ ఎన్నికలు వాయిదా ?

మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ పాలక వర్గం మార్చి 17తో పదవీ విరమణ చేసింది. దాంతో అంతా మాజీలు అయ్యారు.

By:  Satya P   |   24 May 2026 10:00 AM IST
జీవీఎంసీ ఎన్నికలు వాయిదా ?
X

మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ పాలక వర్గం మార్చి 17తో పదవీ విరమణ చేసింది. దాంతో అంతా మాజీలు అయ్యారు. కొత్తగా ఎన్నికలు నిర్వహిసే మరోసారి కార్పోరేటర్ అనిపించుకోవాలని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవి పోయి అపుడే రెండు నెలలు పై దాటింది. ఇలా మాజీ కార్పోరేటర్లు ఉంటే ఆశావహులు కూడా అనేక మంది రేసులోకి వస్తున్నారు. అందరి ఆలోచనలు ఎన్నికల మీదనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తుంది అన్న వార్తలతో అంతా వేచి చూస్తున్న నేపథ్యం ఉంది. అయితే జీవీఎంసీ ఎన్నికలు వాయిదా పడతాయని తాజాగా వస్తున్న వార్తలు అయితే ఆశావహులలో ఆందోళన కలిగిస్తున్నాయి.

వార్డులు పెంచాలని :

ఎందుకు జీవీఎంసీ ఎన్నికలు వాయిదా పడతాయి అంటే వార్డుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ వల్లనే అని అంటున్నారు. జీవీఎంసీకి 98 వార్డులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే ప్రతీ పదిహేను వేల మందికి ఒక డివిజన్ అన్న విధానం మేరకు కార్పోరేషన్ వర్డులు విభజించాలని ప్రభుత్వం సూచించిన నేపధ్యంలో జీవీఎంసీ అధికారులు కసరత్తు చేసి 120 దాకా వార్డులను పెంచారు. ఆ ముసాయిదాను ప్రభుత్వానికి పంపించారు కూడా. అయితే అలా కాదు వార్డులను ఏకంగా 150 దాకా పెంచాలని స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోంది అని తెలుస్తోంది.

అదే జరిగితే కనుక :

అయితే మరో ముప్పై వార్డులు పెంచాలీ అంటే జీవీఎంసీకి పక్కన ఉన్న అరవై దాకా ఉన్న పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల వార్డుల సంఖ్య బాగా పెరుగుతుంది. పెందుర్తి, ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ అయితే ఉంది. వాటికి ఆయన పంచాయతీలలో కూడా సుముఖత ఉంది అని అంటున్నారు.

పెద్ద కసరత్తు గానే :

అయితే జీవీఎంసీలో ఈ వార్డుల విభజన అన్నది పెద్ద కసరత్తు గానే చూస్తున్నారు. ఇదంతా అయ్యేసరికి కనీసంగా ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుందని అంటున్నారు. దాంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికలు జీవీఎంసీకి ఉండే చాన్స్ లేదని అంటున్నారు. ఇక వార్డుల సంఖ్య పెరిగితే కూటమిలోని మూడు పార్టీల ఆశావహులకు పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది. అదే సమయంలో పరిశ్రమలు అభివృద్ధి అంతా రూరల్ సెక్టార్ వైపుగానే ఉంది. అందువల్ల అక్కడ పంచాయతీలను జీవీఎంసీలో చేర్చితే అర్బన్ లుక్ వస్తుందని అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని, అనుమతులకు కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు.

బీజేపీ సైతం :

ఇదిలా ఉంటే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా జీవీఎంసీ వార్డులను 150 దాకా పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ మంత్రి నారాయణను కలిసి వినతి చేశారు. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా దీని మీద కోరారని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా జీవీఎంసీ విస్తరణకు అంగీకరించారని చెబుతున్నారు. దాంతో జీవీఎంసీ వార్డులు బాగా పెరుగుతాయని చెబుతున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఎన్నికలు వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో రాష్ట్రంలో మిగిలిన కార్పోరేషన్లు మున్సిపాలిటీలతో పాటుగా జీవీఎంసీ ఎన్నికలు ఉండవన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.