ఆ సీక్రెట్ రివీల్ చేసిన జీవీ రెడ్డి.. ఏడాది తర్వాత మీడియా ముందుకు టీడీపీ మాజీ నేత
సుమారు ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న టీడీపీ మాజీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు.
By: Tupaki Political Desk | 21 Jan 2026 8:00 PM ISTసుమారు ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న టీడీపీ మాజీ నేత, ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం న్యాయవాద వృత్తికే పరిమితమై రాజకీయాలకు పూర్తిగా దూరం వహిస్తున్న జీవీ రెడ్డి.. రెండు రోజుల క్రితం ఓ పాడ్ కాస్టర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత జీవీ రెడ్డి ఎక్కడ, ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడలేదు. టీవీ డిబెట్లకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే దాదాపు 11 నెలల అజ్ఞాత వాసం అనంతరం ఆయన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో అనేక విషయాలపై తన స్పందన తెలియజేశారు. ముఖ్యంగా తాను రాజీనామా చేసేందుకు దారితీసిన పరిస్థితులు.. ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి అందిన ఆహ్వానాలపై స్పష్టమైన సమాచారం ఇచ్చారు.
టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఎంతో అవకాశం ఇచ్చారని, కానీ పరిపాలన యంత్రాంగంలోని బ్యూరోక్రాట్ల వల్ల తాను ఫైబర్ నెట్ చైర్మన్ గా ఇమడలేకపోయానని జీవీ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబును ఇప్పటికీ తన బాస్ గానే భావిస్తున్నానని చెప్పిన జీవీ రెడ్డి.. ముఖ్యమంత్రి సైతం అఖిల భారత సర్వీసు అధికారులతో వేగలేకపోతున్నారని చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకులకు ఐఏఎస్ అధికారులు సరిగా సహకరించడం లేదని, కేవలం 5 శాతం మంది మాత్రమే సరైన రీతిలో పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐఏఎస్ ల్లో 5 శాతం మంది పనిచేస్తేనే దేశం ఇంత ప్రగతి సాధించిందని, అదే సమయంలో 50 శాతం మంది పనిచేస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఇక తాను రాజీనామా చేయడానికి కారణం ఒక ఐఏఎస్ అధికారి అంటూ వ్యాఖ్యానించిన జీవీ రెడ్డి.. ఫైబర్ నెట్ చైర్మనుగా తాను ఏం చెప్పినా నో అనడంతోనే పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఈ విషయమై పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా సరైన విధంగా స్పందన కనిపించలేదని వెల్లడించారు. అలాంటి పదవిలో తాను ఇమడలేకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన కోర్ టీంలో తనను చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన జీవితంలో ఎప్పుడూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయనని స్పష్టం చేశారు.
రాజీనామా చేసిన తర్వాత బీజేపీ, వైసీపీ నుంచి తనకు ఆహ్వానాలు అందాయని, కానీ తాను పూర్తిగా తన వృత్తి జీవితంపై దృష్టిపెట్టానని తెలిపారు. తన లా ఆఫీసులో యువ న్యాయవాదులను చేర్చుకున్నానని, తాను ఈడీ కేసుల ఎక్స్ పర్ట్ గా ఆ కేసులను చూస్తున్నానని వివరించారు. కాగా, జీవీ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నుంచి ఆహ్వానాలు వచ్చినా వెళ్లలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో టీడీపీ నేతలు సైతం తనను తిరిగి పార్టీలోకి రమ్మనిమని పిలిచారని, కానీ తాను ఆ ఆహ్వానాలను సున్నితంగా తిరస్కరించినట్లు స్పష్టం చేశారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, జీవీ రెడ్డి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి టీడీపీ తరఫున టీవీ డిబేట్లకు హాజరయ్యేవారు. తన వాగ్దాటితో అప్పటి అధికార పక్షాన్ని నిలువరించేవారు. ఆయన పనితీరును మెచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన కోర్ టీంలో ఉండే పది మందిలో ఒకరిగా జీవీ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక ఎన్నికల అనంతరం తొలిసారే కీలకమైన ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దాదాపు నెల రోజుల పాటు చైర్మన్ గా వ్యవహరించిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ లో చోటుచేసుకున్న పలు అవకతవకలను బయటపెట్టారు. ఈ సమయంలోనే ఫైబర్ నెట్ ఎండీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులతో విభేదించిన జీవీ రెడ్డి బహిరంగ విమర్శలు చేయడంతో టీడీపీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. అనంతర పరిణామాలతో తన పదవిని వదులుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు రావడం, టీడీపీ అధినేత చంద్రబాబుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తున్నారు.
