Begin typing your search above and press return to search.

ఆ రెండు నియోజకవర్గాలపై గుత్తా కొడుకు కన్ను!

ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టి దెబ్బతిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేటీఆర్‌ దృష్టి సారించారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:30 PM GMT
ఆ రెండు నియోజకవర్గాలపై గుత్తా కొడుకు కన్ను!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో చావుదెబ్బ తిన్న బీఆర్‌ఎస్‌ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు, తదితర అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గట్టి దెబ్బతిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేటీఆర్‌ దృష్టి సారించారని అంటున్నారు. నల్గొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి గట్టి అభ్యర్థులను నిలపాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి నల్గొండ, భువనగిరిల్లో సీట్లు ఇవ్వాలని కేటీఆర్‌ నిర్ణయించుకున్నట్టు టాక్‌ నడుస్తోంది.

నల్గొండ నుంచి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలాగే నల్గొండతోపాటు భువనగిరిపైనా ఆయన కన్నేశారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి తన కుమారుడికి సీటు ఇవ్వాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది.

అయితే నల్గొండ, భువనగిరి, ఖమ్మం ఎంపీ స్థానాలకు బీఆర్‌ఎస్‌ లో గట్టి పోటీ ఉందని అంటున్నారు. స్వయంగా ఈ విషయాన్ని గుత్తా సుఖేందర్‌ రెడ్డి కూడా అంగీకరించారు. పార్టీ ఆదేశిస్తే తన కుమారుడు నల్గొండ లేదా భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోందని.. రెండు మూడు రోజుల్లో ఇది పూర్తవుతుందని గుత్తా వెల్లడించారు.

కాగా ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. అలాగే భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. వీరిద్దరూ గత లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల వీరిద్దరూ అసెంబ్లీకి పోటీ చేసి ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఇద్దరూ ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ తరఫున గత ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుంచి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేశారు. అలాగే భువనగిరి ఎంపీ స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్‌ బరిలోకి దిగారు. ఇద్దరూ ఓడిపోయారు. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో బూర నర్సయ్య బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేశారు. వేమిరెడ్డి నర్సింహారెడ్డి కూడా పార్టీలో అంత చురుకుగా లేరు. ఈ నేపథ్యంలో నల్గొండ, భువనగిరిల నుంచి బీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థులను బరిలోకి దించనుందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ రెండు స్థానాల్లో ఒక చోట నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డిని బరిలోకి దింపొచ్చని టాక్‌ నడుస్తోంది.