వైసీపీ ఎంపీ జోరు...మ్యాటరేంటో ?
వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే అన్ని విధాలుగా ఇబ్బందులు తోసుకుని వచ్చాయి.
By: Tupaki Desk | 6 May 2025 9:30 AM ISTవైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే అన్ని విధాలుగా ఇబ్బందులు తోసుకుని వచ్చాయి. ఆ పార్టీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉంటే అందులో నుంచి నలుగురు తప్పుకున్నారు. ఆ ఎంపీ సీట్లు కూటమి పరం అయ్యాయి. ఎవరైనా వెళ్ళవచ్చు కానీ విజయసాయిరెడ్డి వైసీపీలోనే ఉంటారు ఆయన రాజకీయ జీవితం అందులోనే పూర్తి కాలం అని అంతా అనుకున్నారు. చివరికి ఆయన కూడా బిగ్ షాక్ ఇచ్చేశారు.
ఈ దెబ్బతో రాజ్యసభలో వైసీపీ బలం కాస్తా ఏడుకు పడిపోయింది. లోక్ సభలో చూసుకుంటే మొత్తం పాతిక సీట్లకు గానూ నలుగురు మాత్రమే గెలిచారు. ఇలా చూస్తే కనుక వైసీపీ పార్లమెంటరీ పార్టీలో ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు.
వీరిలో ఎవరికి వారుగా తమ పనులలో ఉన్నారని చెబుతున్నారు. పార్లమెంట్ సెషన్ లో మాత్రం లోక్ సభలో మిధున్ రెడ్డి రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి చర్చలలో పాల్గొంటున్నా ఆ తరువాత ఢిల్లీలో చూస్తే వైసీపీ వాయిస్ వినిపించడం లేదు అని అంటున్నారు.
మిగిలిన ఎంపీలు అలాగే ఉన్నారు అని అంటున్నారు. అయితే తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి మాత్రం జోరు చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన పార్టీ తరఫున గొంతు విప్పడమే కాకుండా కేంద్రంలోని కీలక మంత్రులతో రాష్ట్ర వ్యవహారాల గురించి సమస్యల గురించి ప్రస్తావిస్తూ కనిపిస్తున్నారు. అలాగే ఢిల్లీ స్థాయిలో ఆయన బాగా పరిచయాలను పెంచుకున్నారు
మీడియా మిత్రులను అక్కడ సంపాదిచుకున్నారు. ఏపీకి సంబంధించి ఏ సమస్య అయినా ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తున్నారు దానికి జాతీయ మీడియా కూడా హైలెట్ చేస్తోంది. తాజాగా గురుమూర్తి సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటన విషయంలో ఘాటుగానే స్పందించారు.
ఆ మధ్యన తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం, ఇపుడు ఏడుగురు మరణించడంతో వరసగా ఆలయాల్లో జరిగే ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేస్తూ లోక్ సభ ఎంపీ హోదాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఈ ఘటనలు భక్తుల ప్రాణాలనే కాదు ఆలయాలలో భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని ఆయన ఆ లేఖలో ఉటంకించారు. ఇవన్నీ ఆలయాలలో పాలనాపరంగా జరిగే తప్పిదాలుగా ఆయన ఆరోపించారు. శ్రీకూర్మంలో తాబేళ్ళు మరణించడాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు
ఇదిలా ఉంటే గురుమూర్తి రెడ్డి 2021లో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయనకే 2024లో సైతం జగన్ టికెట్ ఇచ్చారు. అలా రెండోసారి కూడా ఆయన ఎంపీ అయ్యారు. ఆయన ఫుల్ టైమర్ గా తన బాధ్యతలను అటు ఢిల్లీలో ఇటు గల్లీలో నిర్వహిస్తూ జోరు చూపిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన గురించి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.
జాతీయ స్థాయిలో పలువురు నేతలతో అనుబంధాన్ని పెంచుకుంటూ తనదైన రాజకీయ పలుకుబడిని సంపాదిస్తున్న గురుమూర్తి రెడ్డి వైసీపీలో ఒకే ఒక్కడుగా కనిపిస్తున్నారుట. రాజకీయంగా మంచి భవిష్యత్తు కోసం చూస్తూ బలమైన పునాదులు వేసుకుంటున్న గురుమూర్తి వైసీపీలో ఇపుడు కీలకమైన నేతగా మారిపోయారు. ఒకనాడు జగన్ పాదయాత్రలో ఆయనకు ఫిజియోథెరపీ చేసిన ఒక డాక్టర్ గా ఉన్న గురుమూర్తి ఈ రోజు ఢిల్లీ సర్కిల్స్ లో పేరు నానేంతగా తన ఎంపీ పదవితో ఆకట్టుకుంటున్నారు అంటే జగన్ చాయిస్ కరెక్ట్ అనిపిస్తున్నారు అని అంటున్నారు.
