Begin typing your search above and press return to search.

మర్డర్ కి కారణం ఈ వీడియోనేనా?

రాధికా ఓ యువకుడితో కలిసి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం.

By:  Tupaki Desk   |   11 July 2025 6:53 PM IST
మర్డర్ కి కారణం ఈ వీడియోనేనా?
X

గురుగ్రామ్‌లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అత్యంత దారుణంగా... ఆమె సొంత తండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే మరణించడం ప్రజలను షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా... తాజాగా వెలుగులోకి వస్తున్న వివరాలు విషాదానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

-హత్యకు దారితీసిన 'వీడియో' వివాదం?

రాధికా ఓ యువకుడితో కలిసి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. అదే సమయంలో ఆమె ఎక్కువగా రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ఎక్కువగా సమయాన్ని గడపడం, ఆర్థికంగా స్వతంత్రంగా మారడం తండ్రికి ఇష్టం లేకపోయినట్లు చెబుతున్నారు. ఆ వీడియో ఇంట్లో పరువును దిగజార్చిందని దీపక్ భావించి కుమార్తెపై కోపాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఇది చివరికి ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

-సంపాదన కాదు.. పరువే ప్రధాన కారణమా?

రాధిక సంపాదిస్తున్న డబ్బు చూసి అసూయపడ్డ తండ్రే ఆమెను చంపాడన్న వాదన మొదట ప్రచారంలోకి వచ్చింది. కానీ, దీపక్ యాదవ్ నెలకు రూ. 17 లక్షల వరకు సంపాదిస్తున్నాడని, విలాసవంతమైన ఫామ్ హౌస్‌లు, అనేక ఆస్తులు ఉన్నాయన్న నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆర్థిక అంశం కాకుండా, పరువు, వ్యక్తిగత కోపం, కుటుంబంలో ఉన్న భిన్నాభిప్రాయాలే ఈ దారుణ హత్యకు దారి తీసినవని నిపుణులు భావిస్తున్నారు. పితృస్వామ్య భావజాలం, ఆధునిక భావాలున్న యువతి స్వాతంత్ర్యం పట్ల అసహనం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.

-హత్య అనంతరం తల్లిదండ్రుల వైఖరి

హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యుల్లో ఎవరూ కూడా తక్షణ స్పందన చూపించలేదు. రాధిక తల్లి మంజు యాదవ్ పోలీసులు ప్రశ్నించగానే జ్వరమొచ్చిందని, తెలియదని చెప్పి నోరు విప్పేందుకు నిరాకరించింది. దీపక్ యాదవ్ మాత్రం తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతని వద్ద లైసెన్స్డ్ 32 బోర్ రివాల్వర్ ఉండటం, అలాగే మానసిక స్థితిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. తల్లి మౌనం వెనుక ఉన్న కారణాలు కూడా మిస్టరీగా మారాయి.

-రాష్ట్ర స్థాయి క్రీడాకారిణి.. దారుణాంతం

రాధికా యాదవ్ రాష్ట్ర స్థాయిలో పలు టోర్నమెంట్లలో మెడల్స్ సాధించిన క్రీడాకారిణి. ఆమె విజయాలు కుటుంబానికి గర్వకారణంగా ఉండే సమయంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికర విషయం. వంటగదిలో బ్రేక్ ఫాస్ట్ తయారు చేస్తుండగా తండ్రి వెనక నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరపడం ఘటన తీవ్రతను, ఉద్దేశపూర్వకతను స్పష్టం చేస్తుంది. ఆమె క్రీడా రంగంలో సాధించిన విజయాలను చూసి గర్వపడాల్సిన తండ్రే ఇలా అత్యంత దారుణంగా ఆమెను హతమార్చడం అందరినీ కలచివేస్తోంది.

ఇంత ఆర్థికంగా బలమైన కుటుంబంలో, ముద్దుల కూతుర్ని ప్రేమించిన తండ్రి నుంచి అలాంటి దారుణ చర్య రావడం సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ఒక యువతి స్వతంత్రంగా జీవించాలనే కోరికకు అడ్డుగా ‘పరువు’ అనే భ్రాంతి నిలవడమా? అన్న ప్రశ్న ప్రస్తుతం నలుమూలల నుంచీ వినిపిస్తోంది. ఈ ఘటన మహిళా భద్రత, కుటుంబ వ్యవస్థలో భావోద్వేగాల పాత్రపై సమాజం మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సమాజంలోనూ పరువు పేరుతో జరిగే నేరాలు, ముఖ్యంగా కుటుంబసభ్యుల చేత జరిగే హింసపై తీవ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది.