Begin typing your search above and press return to search.

560 రోజులు ‘టవర్’పైనే.. గెలిచిన గుర్జీత్ సింగ్ పట్టుదల!

ఖల్సా డిమాండ్‌కు తలొగ్గి పంజాబ్ ప్రభుత్వం ‘ది జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ (సవరణ)’ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది.

By:  Tupaki Political Desk   |   25 April 2026 1:00 PM IST
560 రోజులు ‘టవర్’పైనే.. గెలిచిన గుర్జీత్ సింగ్ పట్టుదల!
X

ఒక మనిషి తన నమ్మకం, ఆశయం కోసం 560 రోజుల పాటు అంటే సుమారు ఏడాదిన్నర కాలం 400 అడుగుల ఎత్తులో ఉన్న టవర్‌పైనే గడపడం అనేది వినడానికే ఆశ్చర్యంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పంజాబ్‌కు చెందిన రైతు గుర్జీత్ సింగ్ ఖల్సా చేసిన ఈ మొండి నిరసన చివరకు ప్రభుత్వం దిగివచ్చి చట్టాన్ని సవరించేలా చేసింది.

పంజాబ్ రాజకీయ, సామాజిక చరిత్రలో గుర్జీత్ సింగ్ ఖల్సా పేరు ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. సిక్కుల పరమ పవిత్ర గ్రంథమైన ‘గురు గ్రంథ్ సాహిబ్’ను అపవిత్రం చేసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 2024. అక్టోబర్ 12న ఆయన సమనాలోని ఒక బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కారు. అప్పటి నుంచి నిన్నటి వరకు, అంటే సుమారు 18 నెలల 12 రోజుల పాటు ఆయన భూమికి 400 అడుగుల ఎత్తులోనే నివసించారు. ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా ఆయన చేసిన ఈ ‘ఆకాశ పోరాటా’నికి చివరకు పంజాబ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేలా ఒత్తిడి తెచ్చింది.

టవర్‌పై దుర్భర జీవితం

గుర్జీత్ సింగ్ ఖల్సా టవర్‌పై గడిపిన కాలం సాహస యాత్ర కంటే తక్కువేమీ కాదు. ఒక నిరసనకారుడిగానే కాకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి అక్కడ జీవించారు. టవర్‌పై భాగంలో ఒక చిన్న టార్పాలిన్ షీట్‌తో తాత్కాలిక షెల్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మద్దతుదారులు కింద నుంచి తాళ్ల సాయంతో ఆహారం, నీటిని అందించేవారు. గాలి వేగంగా వీచినా, భారీ వర్షం కురిసినా ఆ ఎత్తులో ఉండడం ప్రాణాపాయం. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. మలమూత్ర విసర్జన కోసం పాలిథీన్ కవర్లను వాడుతూ, వాటిని జాగ్రత్తగా కిందకు పంపేవారు. ఈ స్థాయి క్రమశిక్షణ, పట్టుదల ఆయన ఆశయంపై ఆయనకున్న నిబద్ధతను చాటుతున్నాయి.

స్పందించిన ప్రభుత్వం..

ఖల్సా డిమాండ్‌కు తలొగ్గి పంజాబ్ ప్రభుత్వం ‘ది జాగత్ జోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ (సవరణ)’ పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చింది. పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేసే లేదా అగౌరవపరిచే వ్యక్తులకు కఠినమైన జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా ఈ చట్టంలో నిబంధనలు చేర్చారు. చట్టం అమల్లోకి రావడంతో, అధికారుల విజ్ఞప్తి మేరకు ఖల్సా శుక్రవారం టవర్ దిగి నేలకు చేరుకున్నారు. ఆయనను వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే చోట, పరిమిత స్థలంలో ఉండడం వల్ల ఆయన శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు.

సాధారణంగా ధర్నాలు, రాస్తారోకోలు చూస్తుంటాం. కానీ ఒక వ్యక్తి ఇలా టవర్ పైకి ఎక్కి 560 రోజులు ఉండడం అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. హింసకు తావులేకుండా, తనను తాను కష్టపెట్టుకుంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తీరు చర్చనీయాంశమైంది. పంజాబ్‌లో గురు గ్రంథ్ సాహిబ్ అపవిత్రత అనేది సున్నితమైన అంశం. దీనిపై గతంలో అనేక అల్లర్లు జరిగాయి. కానీ ఖల్సా నిరసన శాంతియుతంగా సాగి, ఆశించిన ఫలితాన్ని సాధించిపెటట్ింది.

గుర్జీత్ సింగ్ ఖల్సా నిరసన విరమణతో పంజాబ్‌లో సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. ఒక సామాన్య పాడి రైతు తన పట్టుదలతో ప్రభుత్వాన్ని కదిలించి, కొత్త చట్టాన్ని తీసుకురావడం ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకున్న బలాన్ని చాటి చెప్పింది. 560 రోజుల తర్వాత ఆయన నేల మీద అడుగు పెట్టడం కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ఊరటనిచ్చింది. చట్టం తీసుకురావడమే కాదు, అది క్షేత్రస్థాయిలో అమలవ్వాలని పంజాబీలు కోరుకుంటున్నారు.