సిక్కోలు టీడీపీకి కొత్త వారసుడు.. పార్టీలో ఏ ప్లేస్ ఇస్తారు?
ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వారసుడు రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన ప్రకటన రావడం చర్చకు తావిస్తోంది
By: Tupaki Desk | 27 Jan 2026 8:00 AM ISTఅధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వారసుడు రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన ప్రకటన రావడం చర్చకు తావిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న గుండ కుటుంబాన్ని గత ఎన్నికల్లో తొలిసారిగా పక్కన పెట్టారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి గత ఎన్నికల వరకు పార్టీ ఇంచార్జిలుగా కొనసాగేవారు. అయితే వయోభారం వల్ల ఆ ఇద్దరు సరిగా పనిచేయలేకపోతున్నారనే కారణంతోపాటు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్ ను పార్టీ తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కుమారుడు విశ్వనాథ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రకటన విడుదల కావడం ఆసక్తికరంగా మారింది.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన గుండ అప్పలసూర్యనారాయణ ఇటీవల మరణించారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే గుండ కుటుంబం కొనసాగుతోంది. 1985లో తొలిసారిగా టీడీపీ టికెట్ దక్కించుకున్న గుండ అప్పలసూర్యనారాయణ 2004 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. దాదాపు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఆయన ఓటమి చెందారు. 2009లో మరోసారి దురదృష్టం వెన్నాడింది. అయితే 2014లో పార్టీ ఆయనను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవికి అవకాశం ఇచ్చింది. అయితే 2019లో లక్ష్మీదేవి కూడా ఓటమి చెందారు. 2024 ఎన్నికల వరకు లక్ష్మీదేవి పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగారు.
అయితే గత ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ గుండ కుటుంబ సభ్యులకు టికెట్ నిరాకరించింది. దీనికి కారణం గుండ భార్యభర్తలు ఇద్దరు 70 ఏళ్ల వయసు పైబడిన వారే అంటున్నారు. అయితే వ్యక్తిగతంగా వారికి పార్టీలో మంచి పేరు ఉండటంతో ఆ కుటుంబాన్ని కాదని వేరొకరికి టికెట్ ఇచ్చే విషయమై పార్టీలో తీవ్ర తర్జనభర్జన జరిగింది. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండు అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి కుమారులు శివగంగాధర్, విశ్వనాథ్ కు టికెట్ ఇస్తామని ఫోటీ చేయాలని పార్టీ నుంచి పిలుపు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరు విదేశాల్లో స్థిరపడటంతో పోటీకి విముఖత చూపారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్ అనూహ్యంగా అవకాశం దక్కించుకున్నారు.
ఇక మాజీ మంత్రి గుండ అప్పలసూర్యానారాయణ ఇటీవల వయోభారంతో మరణించారు. ఆయన దశదిన కర్మ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో అప్పలసూర్యనారాయణ రాజకీయ వారసత్వం అందిపుచ్చుకునేందుకు రెండో కుమారుడు విశ్వనాథ్ సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటన వెలువడింది. అప్పలసూర్యనారాయణ పెద్దకుమారుడు శివగంగాధర్ మాట్లాడుతూ తాను విదేశాలకు వెళ్లిపోతానని, ప్రజలను చూసుకునే బాధ్యత తమ్ముడు విశ్వనాథ్ తీసుకుంటారని ప్రకటించారు. దీంతో గుండ విశ్వనాథ్ రాజకీయ ప్రవేశం ఖాయమన్న సంకేతాలు ఇచ్చినట్లైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 20 నెలల తర్వాత గుండ కుటుంబం నుంచి ఇటువంటి ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ ప్రకటనను పార్టీ ఎలా చూస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో గుండ అప్పలసూర్యనారాయణ కుమారుడిని ప్రోత్సహిస్తే, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. అదే సమయంలో పార్టీని దశాబ్దాలుగా అంటిపెట్టుకు వస్తున్న మాజీ మంత్రి గుండ కుటుంబానికి న్యాయం చేయడం ఎలా అన్న చర్చ పార్టీలో ఉత్పన్నమవుతోందని అంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గుండ అనుచరులు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. దశాబ్దాలుగా గుండ అప్పలసూర్యనారాయణ నాయకత్వంలో పనిచేసిన వారు ఎమ్మెల్యే శంకర్ కింద పనిచేయలేతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్టీలో మార్పుచేర్పులు జరిగిన సమయంలో ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు సహజంగానే వస్తాయని హైకమాండ్ వ్యాఖ్యానిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్యే శంకర్ మాటకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది.
అయితే ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోతున్న మాజీ మంత్రి గుండ అనుచరులు ఆయన వారసుడిని యాక్టివ్ అయ్యేలా చేస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో గుండ తనయుడు విశ్వనాథ్ రాజకీయంగా క్రియాశీలంగా తిరిగితే నియోజకవర్గంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇది ఒక విధంగా పార్టీలో అంతర్గత పోరుకు దారితీసే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి తలెత్తకూడదంటే టీడీపీ అధిష్టానం ముందుగానే మేల్కొవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు నియోజకవర్గంలో ఉన్న పరపతిని భేరీజు వేసి ఆయన తనయుడికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సివుందని అంటున్నారు.
