Begin typing your search above and press return to search.

గుమ్మ‌నూరు గ‌రం కామెంట్స్‌

వైసీపీ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌, ప్ర‌స్తుత మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. గ‌రంగ‌రం వ్యాఖ్య‌లు చేశారు

By:  Tupaki Desk   |   12 Jan 2024 3:41 PM GMT
గుమ్మ‌నూరు గ‌రం కామెంట్స్‌
X

వైసీపీ నాయ‌కుడు, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌, ప్ర‌స్తుత మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం.. గ‌రంగ‌రం వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే.. మార్పులు, చేర్పుల్లో భాగంగా పార్టీ అధిష్టానం.. గుమ్మ‌నూరును ఈ ద‌ఫా పార్ల‌మెంటుకు పంపించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి తాజాగా వెలువ‌రించిన మూడో జాబితాలోనే ఆయ‌న‌కు క‌ర్నూలు పార్ల‌మెంటు టికెట్‌ను ఖరారు చేసింది. ఇక‌, క‌ర్నూలు అసెంబ్లీ స్థానాన్ని విరూపాక్షికి కేటాయించారు. దీంతో ఒక సందేహం.. ఒక స‌మ‌స్య‌కు పార్టీ అధిష్టానం తెర‌దించేసింది.

అయితే.. ఇప్పుడు మంత్రి గుమ్మ‌నూరు మాత్రం మ‌రో ర‌చ్చ‌కు తెర‌దీశారు. తాజాగా ఆయ‌న ఆలూరులోని త‌న వ‌ర్గంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎంపీ టికెట్‌పై వారితో చ‌ర్చించారు. మీరేమంటారు? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ''ఎంపీ టికెట్ నా రైట్ పాకెట్‌(కుడి జేబు)లో ఉంది. ఇంకా స‌మ‌యం మించి పోలేదు. ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు మాసాల గ‌డువు ఉంది. మీరు ఎలా చెబితే అలా చేస్తా. అధిష్టానం విష‌యాన్ని ప‌క్క‌న పెట్టండి. మీరు ఏమంటారో చెబితే.. దానిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటా'' అని తేల్చి చెప్పారు.

అయితే.. కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు మాత్రం నిర్ణ‌యాన్ని ఆయ‌న‌కే వ‌దిలేశారు. ఇదిలావుంటే.. అధిష్టానం మాత్రం గుమ్మ‌నూరు వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకునే అవ‌కాశం ఉంది. ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గ‌తంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌.. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఆధారాల‌తో స‌హా.. స్కోడాకారును బ‌హుమ‌తిగా పొందార‌ని.. సొంత కుటుంబ స‌భ్యుల బూముల‌నే ఆక్ర‌మించారంటూ.. ఆరోప‌ణ‌లు చేశారు.

2021-22 మ‌ధ్య ఈ వివాదం ప్ర‌భుత్వానికి కూడా సెగ పెట్టింది. అయిన‌ప్ప‌టికీ.. గుమ్మ‌నూరుకు టికెట్ ఇచ్చారు. దీనిపై ఆయ‌న ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించ‌డం.. ఆయ‌న వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా, క‌ర్నూలు ఎంపీ టికెట్ కోసం.. మాజీ ఎంపీ బుట్టా రేణుక స‌హా.. అనేక మంది ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.