800 కోట్ల విలాసం.. అంబానీ అల్లుడికి ముంబై తీరంలో అద్భుత కానుక
ఈ భవనం ప్రధాన ఆకర్షణ దీని `డైమండ్ థీమ్` (వజ్రాల నమూనా). భవనం వెలుపలి భాగం మొత్తం త్రిమితీయ (3డి) మోడలింగ్ సాంకేతికతతో స్టీల్ - గ్లాస్ అల్లికతో చక్కగా నిర్మించారు.
By: Sivaji Kontham | 31 May 2026 5:00 PM ISTముంబైలోని అత్యంత ప్రైమ్ ఏరియాగా చెప్పుకునే `వర్లి` తీరంలో అరేబియా సముద్రపు అందాలకు ఎదురుగా గంభీరంగా నిలిచి ఉంటుంది `గులితా మహల్` భవంతి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ- పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్‌లకు చెందిన ఈ నివాసం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఇళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 818 కోట్ల (100 మిలియన్ డాలర్లు) విలువైన ఈ ఐదు అంతస్తుల అల్ట్రా-లగ్జరీ బంగళా సముద్రపు అలలు ఆకాశాన్ని తాకే అద్భుతమైన ప్రదేశంలో వాస్తుకళా నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ అద్భుతమైన భవనానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 2018 డిసెంబర్‌లో ఈషా అంబానీ- ఆనంద్ పిరమాల్‌ల వివాహం జరిగినప్పుడు.. ఆనంద్ తల్లిదండ్రులైన స్వాతి- అజయ్ పిరమాల్ నూతన దంపతులకు `గులితా`ను ఒక పెళ్లి కానుకగా బహుకరించారు. అంతకుముందు 2012లో హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ నుండి ఈ 50,000 చదరపు అడుగుల స్థలాన్ని పిరమాల్ కుటుంబం వేలంలో దాదాపు 450కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చరల్ సంస్థ `ఎకర్స్‌లీ ఓ కల్లాఘన్` ఈ భవనాన్ని అత్యాధునిక శైలిలో అద్భుతంగా డిజైన్ చేసింది.
ఈ భవనం ప్రధాన ఆకర్షణ దీని `డైమండ్ థీమ్` (వజ్రాల నమూనా). భవనం వెలుపలి భాగం మొత్తం త్రిమితీయ (3డి) మోడలింగ్ సాంకేతికతతో స్టీల్ - గ్లాస్ అల్లికతో చక్కగా నిర్మించారు. ఇది ఒక కట్ చేసిన వజ్రం లాగా మెరుస్తూ సహజమైన వెలుతురును లోపలికి రప్పిస్తుంది. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ 3డి టూల్స్‌తో రూపొందించిన 11 మీటర్ల ఎత్తున్న మూడు ప్రత్యేకమైన గ్లాస్ స్టీల్ `పామ్ ట్రీ` స్ట్రక్చర్లు ఈ ప్యాలెస్ ముఖద్వారానికి మరింత రాజసపు ఔన్నత్యాన్ని ఆపాదించాయి.
`గులితా` ప్యాలెస్ లోపలి భాగాలను కూడా కళ్లు చెదిరే రీతిలో డిజైన్ చేసారు. విశాలమైన ఎంట్రన్స్ లాబీ, డబుల్ - ట్రిపుల్ హైట్ కలిగిన మల్టీపర్పస్ రూములు, సర్క్యులర్ స్టడీ రూములు.. పెద్ద డైనింగ్ హాళ్లు ఇందులో ఉన్నాయి. ఈ ఇల్లు ఐదు అంతస్తులతో పాటు మూడు అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్ లెవెల్స్ కలిగి ఉంది. మొదటి బేస్‌మెంట్‌లో సుందరమైన లాన్ ... ఓపెన్ ఎయిర్ వాటర్ బాడీ ఉండగా.... రెండో బేస్‌మెంట్‌లో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, స్పా, జిమ్ వంటి వసతులు ఉన్నాయి. మూడో బేస్‌మెంట్ ని దాదాపు 20 లగ్జరీ కార్లను పార్కింగ్ చేయడానికి సౌకర్యంగా నిర్మించారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 27 అంతస్తుల `యాంటిలియా` భవనంలో పుట్టి పెరిగిన ఈషా అంబానీ వివాహానంతరం తన భర్త, పిల్లలతో కలిసి ఈ `గులితా మహల్`ను తన సొంత ప్రపంచంగా మార్చుకున్నారు. ముంబై నగర స్కైలైన్‌లో ఒక సరికొత్త ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన ఈ భవనం, కేవలం సిరిసంపదలకే పరిమితం కాకుండా మోడ్రన్ టెక్ వసతులతో అదే సమయంలో ప్రకృతి అందాల కలయికతో పారిశ్రామిక దిగ్గజాల జీవనశైలి వైభవానికి ఒక ప్రతీకగా నిలుస్తోంది.
