అమ్మతనానికే మాయని మచ్చ.. హెచ్ఐవీ వ్యక్తికి కూతుర్ని అప్పగించిన తల్లి
నిందితుడి దారుణాలకు, తల్లి బెదిరింపులకు భయపడి చివరకు బాధితురాలు తన అత్తకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం చేసింది.
By: Tupaki Desk | 26 May 2025 10:19 AM ISTతల్లి అంటే తన పిల్లల కోసం ప్రాణం పెట్టేస్తుంది. కానీ గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలోని ధోరాజి పట్టణంలో చోటు చేసుకున్న ఒక దారుణ సంఘటన, తల్లిదండ్రుల మీద నమ్మకాన్ని కదిలించివేసింది. సొంత కన్న కూతురు, మైనర్ అయిన టీనేజ్ బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటానికి తల్లి సహకరించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడికి, బాలిక తల్లికి ఇద్దరికీ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం కలకలం రేపింది.
బాధితురాలి అత్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 2024 సెప్టెంబర్ 17న నమోదైన ఫిర్యాదు ప్రకారం.. గత రెండు నెలల నుండి తల్లి తన కూతుర్ని నిందితుడి ఇంటికి పదే పదే పంపేదని, అక్కడ ఆ వ్యక్తి బాలికపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఆ దారుణాల గురించి ఎవరికీ చెప్పవద్దని, అలా చేస్తే చంపేస్తానని బెదిరించి తల్లి తన కూతుర్ని మౌనంగా ఉంచేదని పేర్కొన్నారు.
నిందితుడి దారుణాలకు, తల్లి బెదిరింపులకు భయపడి చివరకు బాధితురాలు తన అత్తకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం చేసింది. అత్త అడిగినప్పుడు, బాలిక తనపై జరుగుతున్న దారుణాలను వివరించింది. వెంటనే, అత్త ఈ విషయాన్ని బాలిక తండ్రి దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో బాలిక వైద్య నివేదికలు ఆరోపణలను ధృవీకరించాయి. ఈ కేసులో మరింత షాకింగ్ విషయమేమిటంటే.. నిందితుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఇది బాధితురాలికి కలిగిన మానసిక క్షోభను, ఆరోగ్యపరమైన ప్రమాదాన్ని మరింత పెంచింది.
నిందితుడు మొబైల్ రీఛార్జ్ షాపును నిర్వహిస్తుంటాడు. బాధితురాలి తల్లి తరచుగా ఆ షాపుకు వెళ్లేది. నిందితుడు బాలికను తన బైక్‌పై తీసుకెళ్తున్న వీడియో రికార్డింగ్‌లు కూడా ఉన్నాయని సమాచారం. ఈ కేసులో న్యాయస్థానం లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని POCSO చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 17 కింద, అలాగే BNS సెక్షన్ 64(2), సెక్షన్ 54 కింద దోషిగా నిర్ధారించింది. ఇద్దరికీ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇది ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా మారింది. ఈ కేసులో బాధితురాలికి రూ.7 లక్షల పరిహారాన్ని కూడా న్యాయస్థానం మంజూరు చేసింది.
