Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రికి టికెట్ లేదా. ... త్యాగరాజు అయిపోతున్నారా ..?

విశాఖ జిల్లా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లేదా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 3:57 AM GMT
వైసీపీ మంత్రికి టికెట్ లేదా. ...  త్యాగరాజు అయిపోతున్నారా  ..?
X

వైసీపీలో కీలక మంత్రి జగన్ కి ఇష్టుడు సన్నిహితుడుగా పేరు మోసిన విశాఖ జిల్లా మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ కి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ లేదా అన్న చర్చ సాగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్న గుడివాడ ఈ సందర్భంగా కూడా తన సీటు గురించి పెద్దగా మాట్లాడలేదు. అప్పటికే ఆయన సిట్టింగ్ సీటులోకి ఇంచార్జి వచ్చారు.

గుడివాడ ఆశలు పెట్టుకున్న సీట్లలో సిట్టింగులు కదిలేది లేదని చెబుతున్నారు. చోడవరం నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని గుడివాడ తలచారు. అక్కడ సీనియర్ ఎమ్మెల్యే సిట్టింగ్ అయిన కరణం ధర్మశ్రీ తనకే ఆ సీటు అని తెగేసి చెప్పేశారు. జగన్ సైతం ఆయన మాట కాదనలేకపోయారు. ఒక దశలో ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పంపించాలనుకున్నా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో ఎందుకొచ్చిన కొత్త రచ్చ అని అనుకున్నారో ఏమో ఊరుకున్నారు.

ఇక ఎలమంచిలి నుంచి పోటీ చేయాలని మంత్రిగా ఉన్నప్పటి నుంచి గుడివాడ చేయని ప్రయత్నం లేదు. దాంతో అక్కడ సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజుకు గుడివాడకు మధ్య తెలియని ఒక వార్ నడచింది. అయితే ఆ సీటు విషయంలో కూడా అధినాయకత్వం గుడివాడకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని తెలుస్తోంది.

పెందుర్తి సీటు నుంచి పోటీ చేస్తారు అని లేటెస్ట్ గా వార్తలు వచ్చినా సామాజిక సమీకరణలు వెలమలకు చాన్స్ అన్న లెక్కలతో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ని కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. దాంతో గుడివాడ ఆశలు దాదాపుగా ఎమ్మెల్యే సీటు విషయంలో లేవు అనే అంటున్నారు.

ఆయనను ఎంపీగా అనకాపల్లి నుంచి పంపిస్తారు అన్న టాక్ అయితే ప్రస్తుతానికి ఉంది కానీ అక్కడ కూడా వైసీపీ సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుంటోంది. అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కాపులకు ఇచ్చినందువల్ల గవరలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకుంటోందిట. ఇలా మొత్తం పరిణామాలు చూస్తే గుడివాడకు ఎక్కడా చాన్స్ లేనట్లుగానే ఉంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో మీడియా ముందుకు వచ్చిన గుడివాడ తన జాతకం జగన్ రాస్తారు అంటూ ఒకింత వైరాగ్యంతో కూడిన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అందరి రాతలు దేవుడు రాస్తాడని, తన రాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ రాస్తారు అని ఆయన చెప్పడం విశేషం.

తనకు టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ జెండా పట్టుకుంటాను పనిచేస్తాను మళ్లీ జగన్ని సీఎం గా చేస్తామని ఆయన అంటున్నారు. అంటే ఆయన త్యాగరాజు అయిపోతున్నారా అన్న చర్చ అభిమానులలో అనుచరులలో కలుగుతోంది.

యువ నేతగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడిగా ఉన్న గుడివాడకు అవకాశాలు బాగా వచ్చినా మంత్రి అయిన తరువాత ఆయన వర్గ పోరుకు తెర లేపారని, ఉన్న వారిని దూరం చేసుకున్నారని ఆ ఫలితమే ఆయన పోటీ చేసి గెలిచిన అనకాపల్లి సీటుకు దూరం చేసింది అని అంటున్నారు. అలాగే మిగిలిన సీట్లలో ఆయనకు ఎవరు రమ్మని రెడ్ కార్పెట్ వేస్తారని కూడా అంటున్నారు. గట్టిగా నాలుగు పదులు లేని ఈ యువ నేత రాజకీయ జాతకాన్ని ఆయన చెప్పినట్లుగానే జగన్ ఎలా రాయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది.