Begin typing your search above and press return to search.

పవన్‌ పై గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు!

పొత్తు పెట్టుకుని తక్కువ సీట్లు తీసుకోవడం ద్వారా అభిమానులను, జనసేన నేతలను, కార్యకర్తలను పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడని అమర్నాథ్‌ ధ్వజమెత్తారు.

By:  Tupaki Desk   |   13 March 2024 9:04 AM GMT
పవన్‌ పై గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు!
X

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పై అనకాపల్లి ఎమ్మెల్యే, ఏపీ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజువాకలో పవన్‌ కళ్యాణ్‌ తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తనపై పవన్‌ పోటీ చేస్తే తనదేనని అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు. పొత్తు పెట్టుకుని తక్కువ సీట్లు తీసుకోవడం ద్వారా అభిమానులను, జనసేన నేతలను, కార్యకర్తలను పవన్‌ కళ్యాణ్‌ మోసం చేశాడని అమర్నాథ్‌ ధ్వజమెత్తారు. పవన్‌ తనపై పోటీ చేస్తారో, లేదో తెలియదని.. పోటీ చేస్తే తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

పవన్‌ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని అమర్నాథ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు తగ్గించుకోవాల్సిన సీట్లను పవన్‌ తగ్గించుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ను ఓడించడం ఎవరి వల్ల కాదని అమర్నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. పవన్‌ ను అమాయకుడిని చేసి చంద్రబాబు మోసం చేశాడన్నారు.

కాగా గుడివాడ అమర్నాథ్‌ ప్రస్తుతం అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా తాజాగా ఆయనకు గాజువాక సీటును వైసీపీ అధినేత జగన్‌ కేటాయించారు. కొద్దిరోజుల క్రితం అమర్నాథ్‌ కు సీటు ఉండదనే చర్చ భారీ ఎత్తున సాగింది. ఇందుకనుగుణంగా అమర్నాథ్‌ కూడా తనకు సీటు ఇవ్వకపోయినా బాధపడనని, వైసీపీని వీడిపోనని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో గుడివాడ అమర్నాథ్‌ సేవలను పార్టీకి వినియోగించుకుంటారనే చర్చ సాగింది. అందులోనూ ఇప్పుడు అమర్నాథ్‌ ను అభ్యర్థిగా ప్రకటించిన గాజువాకకు ఇప్పటికే జగన్‌ ఉరికూటి రామచంద్రరావును అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన బీసీ వర్గానికి చెందినవారు.

తనను గాజువాక అభ్యర్థిగా నియమించడంతో గత రెండు నెలల నుంచి ఉరికూటి రామచంద్రరావు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతలోనే ఆయనను అభ్యర్థిగా తప్పించి గుడివాడ అమర్నాథ్‌ కు గాజువాక సీటును కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌.. గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి పవన్‌ భీమవరం నుంచే పోటీ చేస్తారని స్వయంగా తాజాగా జనసేన పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు స్పష్టం చేశారు. అది కూడా పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో పవన్‌ భీమవరం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తాజా వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి.