Begin typing your search above and press return to search.

గుడివాడకు గాజువాక గండాలు...!

జగన్ కి అత్యంత ఇష్టుడైన మంత్రి ఎవరు అంటే గుడివాడ అమర్నాధ్ పేరు చెబుతారు. జగన్ ఆయనను 2014 నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు

By:  Tupaki Desk   |   13 March 2024 6:20 PM GMT
గుడివాడకు గాజువాక గండాలు...!
X

జగన్ కి అత్యంత ఇష్టుడైన మంత్రి ఎవరు అంటే గుడివాడ అమర్నాధ్ పేరు చెబుతారు. జగన్ ఆయనను 2014 నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సీనియర్లు ఎంతో మంది ఆనాడు జిల్లాలో ఉన్నా కూడా సుదీర్ఘ కాలం పాటు వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా గుడివాడను జగన్ కొనసాగించారు. ఆ తరువాత ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు. అక్కడ ఓడిపోతే 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. మాట ఇచ్చి మరీ మంత్రిని చేశారు.

ఇక గాజువాక టికెట్ ని గుడివాడకు ఇస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ కి ఇష్టుడైన మంత్రికి టికెట్ లేదా అని చాలా మంది అనుకున్నారు. ఆయనకు మాత్రం జగన్ మీద నమ్మకం ఉంది. అందుకే సైలెంట్ గా ఉన్నారు. ఇపుడు గాజువాక టికెట్ రావడంతో గుడివాడ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడను విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఆయన నివాసం ద్వారా భారీ ఊరేగింపుగా అభిమానులు తీసుకుని వచ్చారు. గుడివాడ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను గాజువాక నుంచి భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే టికెట్ సాధించి గుడివాడ తొలి విజయం అందుకున్నారు కానీ గాజువాక వైసీపీలో వర్గ పోరుని ఆయన ఏ విధంగా అధిగమిస్తారు అన్నది చర్చనీయాంశం అవుతోంది. గుడివాడకు ముందు ఇంచార్జిగా ఉన్న కార్పోరేటర్ ఉరుకూటి చందు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన గుడివాడ అనుచరుడే. కానీ ఒకసారి ఇంచార్జి అని చెప్పిన తరువాత ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను అని అనుకున్నారు. దాంతో ఆయనను కూడా చేరదీయాల్సి ఉంది.

ఇక తన కుమారుడికి ఈసారి టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పట్టుబట్టారు. కానీ సీన్ రివర్స్ అయింది. మంత్రికి టికెట్ వచ్చింది. దాంతో తిప్పల నాగిరెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారు అన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇక్కడ కీలకంగా ఉన్నారు. గాజువాక తొలి ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య మరో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి కూడా సీటుని ఆశించారు.

ఇపుడు వారిని కూడా కలుపుకుని పోవాల్సి ఉంది. అయితే మీడియాతో మాట్లాడిన గుడివాడ అంతా తాము ఒక్క కుటుంబమని వైసీపీ విజయం కోసం జగన్ని మరోసారి సీఎంగా చూడాలన్న కోరికతో అందరం కలసి పనిచేస్తామని చెప్పారు. అలాగే తాను తొందరలో అందరి నాయకులను కలసి మద్దతు కోరుతాను అని చెప్పారు.

ఇక గాజువాక సామాజిక సమీకరణలు చూస్తే కాపులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ తరువాత యాదవులు ఉంటారు. టీడీపీ యాదవులకు ఇస్తే జనసేన నుంచి కాపుల మద్దతు దక్కుతుందని దాంతో ఈసారి టీడీపీ గెలవవచ్చు అని ఆ పార్టీ అంచనా కడుతోంది. దానికి రివర్స్ ప్లాన్ లో వైసీపీ ఉంది. కాపు అభ్యర్ధిని దించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన చందును కొన్నాళ్ళ పాటు ఇంచార్జిగా చేసి వారి ప్రాధాన్యతను గుర్తించామని చెప్పుకుంది.

ఇక చందుకు ఎమ్మెల్సీ వంటి పదవి ఇస్తామని చెప్పడం ద్వారా యాదవులను మొత్తం మచ్చిక చేసుకుంటారు అని అంటున్నారు. అయితే ఈ సమీకరణలు వర్గ పోరు అన్నది అంత సులువు కాదు అని అంటున్నారు. దాంతో పాటు స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గం కూడా ప్రైవేటీకరణ మీద గుర్రుగా ఉంది. వారు బీజేపీని తప్పుపడుతూనే వైసీపీని టీడీపీని కూడా విమర్శిస్తున్నారు. మరి వారి మద్దతు కూడా కీలకం. మొత్తానికి గుడివాడ ముందు అనేక గండాలు ఉన్నాయి. ఆయన ఎలా వాటిని అధిగమిస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.