గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల టార్గెట్ అదేనా... !
ఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క లక్ష్యం. పనిచేయాలని అనుకున్న వారికి.. నియోజకవర్గాన్ని హైలెట్ చేయాలని అనుకున్నవారికి అనేక లక్ష్యాలు ఉంటాయి.
By: Tupaki Desk | 7 July 2025 8:15 AM ISTఒక్కొక్క ఎమ్మెల్యేది ఒక్కొక్క లక్ష్యం. పనిచేయాలని అనుకున్న వారికి.. నియోజకవర్గాన్ని హైలెట్ చేయాలని అనుకున్నవారికి అనేక లక్ష్యాలు ఉంటాయి. వాటిలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు.. గుడివాడ నియోజకవర్గం అనగానే.. బూతులు, పేకాట, కేసినో, కోడిపందేలు వంటివి కనిపించాయి. అవే మాటలు వినిపించాయి. దీనిని కూడా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి `లక్ష్యం` అవే కాబట్టి.. ఆయన వాటినే ప్రోత్సహించారు. కానీ.. ప్రజలు ఎంతోకాలం ఇలాంటి లక్ష్యాలను అంగీకరించరు కదా!.
గత ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. 'గుడివాడను వాషింగ్టన్'గా మారుస్తానని చెప్పిన వెనిగండ్ల లక్ష్యాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారు. గుడివాడ తీరును మార్చాలని అనుకున్నారు. నిజానికి గుడివాడ నుంచి ఎవరైనా బయటకు వచ్చినా.. ఒకప్పు డు చిన్న చూపునకు గురయ్యేవారట. గుడివాడ నుంచి వచ్చారా? అని ఒకరకమైన చిన్నచూపుతో ఉండేవారట. అలాంటి పరిస్థితిలో ఉన్న నియోజకవర్గాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్‌తో పోల్చి అలా అభివృద్ధి చేస్తానని చెప్పిన వెనిగండ్ల వైపు ప్రజలు నిలబడ్డారు. అందుకే రాము విజయం దక్కించుకున్నారు.
ఇక, ఇప్పుడు ఎలా ఉంది? అనేది చూస్తే.. వెనిగండ్ల దూకుడు, లక్ష్యం ఒక్కటే కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి-అభివృద్ది.. ఈ రెండు మాటలు తప్ప.. ఆయన నుంచి ఎలాంటివి వినిపించడం లేదని స్థానికంగా జోరుగా వినిపిస్తున్న టాక్. ఇటీవల చంద్రబాబు పిలుపు మేరకు.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఫస్ట్ ఫస్ట్‌గుడివాడలోనే మంత్రి రాంప్రసాద్ పర్యటించారు. ఆయనను సాదరంగా ఆహ్వానించిన రాము.. ఏడాది కాలంలో చేపట్టిన పనులు, ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రజల సముఖంలోనే వివరించారు.
దీనిని ప్రజలు కూడా అంగీకరించారు. వచ్చే నాలుగేళ్లలో గుడివాడను వాషింగ్టన్ మాదిరిగా చేస్తారన్న నమ్మకాన్ని ప్రజలుకూడా వెలిబుచ్చడం గమనార్హం. ఇలా ఒక నియోజకవర్గంపై అక్కడి ఎమ్మెల్యేపెట్టుకున్న లక్ష్యాన్ని.. ప్రజలే చెప్పడం అంటే.. మాటలు కాదు. దీనికి ఆ ఎమ్మెల్యే ఎంత కృషి చేస్తుండాలి? ఎంత మేరకు ప్రజల్లో విశ్వాసం కనబరచాలి? అనేవి ప్రశ్నలు. అందునా.. గుడివాడ వంటి మాస్ నియోజకవర్గంగా పేరున్న నియోజకవర్గంలో రాము ఇంత మార్పు తీసుకురావడం.. నిజంగా అభినందించాల్సిన విషయమేనని అంటున్నారు పరిశీలకులు.
