Begin typing your search above and press return to search.

గుడివాడ ఫుల్ సైలెంట్... ఎందుకలా ?

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ గడబిడ అయితే ఎక్కడా లేదని అంటున్నారు. ఆయన అలిగారా లేక అసంతృప్తిగా ఉన్నారా లేక బిజీగా వేరే పనులలో ఉన్నారా అన్న చర్చ అయితే వైసీపీలో పెద్ద ఎత్తున సాగుతోంది.

By:  Tupaki Desk   |   10 Jun 2025 9:18 AM IST
గుడివాడ ఫుల్ సైలెంట్... ఎందుకలా ?
X

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ గడబిడ అయితే ఎక్కడా లేదని అంటున్నారు. ఆయన అలిగారా లేక అసంతృప్తిగా ఉన్నారా లేక బిజీగా వేరే పనులలో ఉన్నారా అన్న చర్చ అయితే వైసీపీలో పెద్ద ఎత్తున సాగుతోంది.

ఆయన విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఉండేవారు. అయితే నెల రోజుల క్రితం ఆయన పదవి పోయింది. ఆయన ప్లేస్ లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ అయిన కేకే రాజుని నియమించారు. ఆనాటి నుంచి గుడివాడ అయిపూ అజా లేకుండా పోయారు అని అంటున్నారు.

ఆయనని విశాఖ పార్టీ బాధ్యతల నుంచి తప్పించడంతో అసంతృప్తికి గురి అయ్యారని అంటున్నారు. గుడివాడకి దీని కంటే ముందు గాజువాక ఇన్చార్జి పదవి నుంచి తప్పించి చోడవరం వైసీపీ ఇంచార్జి గా బాధ్యతలు అప్పగించారు. దాంతోనే ఆయన నిరాశ పడ్డారని అప్పట్లో చెప్పుకున్నారు.

తాను ఉండే ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న చోడవరానికి ప్రతీ రోజూ వెళ్ళి పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం సాధ్యపడుతుందా అన్నదే గుడివాడ ఆవేదన అని అంతా చెప్పుకున్నారు. అంతే కాదు ఆయన భీమునిపట్నం వైసీపీ ఇన్చార్జి బాధ్యతలను కోరుకున్నారు. కానీ అది కాస్తా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు ఇచ్చేశారు.

దాంతో గుడివాడకు పూర్తిగా విశాఖ జిల్లాతో బంధాలను కట్ చేశారు అన్న ఆవేదన ఆయనలో ఉందని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉంటూ వచ్చిన గుడివాడకు ఈ రోజుకీ సొంత నియోజకవర్గం అంటూ లేదని అంటున్నారు. ఆయన గాజువాక ప్రాంతానికి చెందిన వారు అయినా అక్కడ మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబం ఉందని దాంతో వారికి ప్రాధాన్యత ఇస్తూ అనకాపల్లికి పంపించి మరీ వైసీపీ గుడివాడని రాజకీయంగా బదిలీ చేసిందని అంటున్నారు.

అలా అనకాపల్లి నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుడివాడ 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయితే అదే తన సొంత నియోజకవర్గం కాబట్టి ఇంచార్జి బాధ్యతలతో కొనసాగిస్తారు అని భావించినా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. గుడివాడను చోడవరానికి ట్రాన్స్ ఫర్ చేశారు

విశాఖ జిల్లా వాసిని అయిన తాను పోటీ చేయడనికి విశాఖ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలే లేవా అన్నది గుడివాడ ఆవేదన అని అంటున్నారు. ఇక గుడివాడ సొంత సామాజిక వర్గమైన కాపులు ఎక్కువగా విశాఖ ఉత్తరం, పెందుర్తి, భీమిలీ, గాజువాకలలో ఉన్నారు. హై కమాండ్ తలచుకుంటే ఈ నాలుగు చోట్లలో ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయవచ్చు అని అంటున్నారు.

కానీ గుడివాడని ఏకంగా జిల్లా దాటించేశారు అని అంటున్నారు. దీని వెనక సొంత పార్టీలోని ప్రత్యర్ధుల హస్తం ఉందని అనుమానించిన గుడివాడ తన నోటికి తాళం వేసుకుని ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లారని అంటున్నారు. మరి జగన్ కి అత్యంత సన్నిహితుడైన ఈ మాజీ మంత్రి తన పంతం నెగ్గించుకుని తిరిగి విశాఖ రాజకీయాల్లో పట్టు సాధిస్తారా అన్నదే చర్చగా ఉంది.