గుడివాడను దూరం పెట్టేశారా ?
విశాఖ వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ని విశాఖ నుంచి దూరం పెట్టేశారా అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 24 April 2025 8:15 AM ISTవిశాఖ వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ని విశాఖ నుంచి దూరం పెట్టేశారా అన్న చర్చ సాగుతోంది. తాజాగా వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లాకు అధ్యక్షుడిగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి అయిన కేకే రాజుని నియమించింది. దాంతో పాటుగా గుడివాడకు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించింది.
దీనికి కొద్ది నెలల ముందు విశాఖ అనకాపల్లి రెండూ కలిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గుడివాడను పార్టీ నియమించింది. అయితే ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాకను ఆయనకు ఇవ్వలేదు. ఆయనను చోడవరం అసెంబ్లీకి ఇంచార్జిగా నియమించింది.
అయితే గుడివాడ భీమునిపట్నం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సీటుకు ఇంచార్జిగా వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ అయిన మజ్జి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించింది.
అలా విశాఖ జిల్లాలో గుడివాడ పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేకుండా పోయింది. ఆయనకు చోడవరం వెళ్ళడం ఏ మేరకు ఇష్టమో తెలియదు అని అనుకున్నారు. గుడివాడ సైతం విశాఖ జిల్లాలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు.
అయితే సడెన్ గా హైకమాండ్ ఆయనకు విశాఖ జిల్లా బాధ్యతలను కూడా లేకుండా చేసింది. దాంతో ఇక మీదట గుడివాడ రాజకీయ స్థావరం కార్యక్షేత్రం అంతా అనకాపల్లి జిల్లావే అని అంటున్నారు. అదే సమయంలో కేకే రాజుకి కీలక బాధ్యతలే ఇచ్చారు.
ఆయన వైసీపీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. 2019, 2024 ఎన్నికల్లో రెండు సార్లు ఆయన ఉత్తరం నుంచి పోటీ చేసినా ఓటమి పాలు అయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆయన కీలకమైన నామినేటెడ్ పదవులు అందుకున్నారు.
ఇక విశాఖ జిల్లాలో వైసీపీ బాగా వీక్ గా ఉంది. తాజాగా జీవీఎంసీ లో సొంత పార్టీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టినా కూడా కాపాడుకోలేకపోయారు. ఈ కారణం వల్లనే గుడివాడను విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు అని ప్రచారం సాగుతోంది.
మరి కేకే రాజు విషయానికి వస్తే ఆయన నియోజకవర్గానికి తప్పించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. దూకుడుగా రాజకీయం చేయరని అంటారు. అయితే అర్ధబలం ఉంది. దాంతోనే పార్టీ ఆయనను ప్రెసిడెంట్ గా చేసిందా అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎందరినో పార్టీ ఇప్పటిదాకా నియమించింది. ఎవరూ విశాఖ సిటీలో పార్టీకి వైభవం తీసుకుని రాలేకపోయారు. మరి రాజు గారి రాజ్యంలో అయినా ఫ్యాన్ గిర్రున తిరుగుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
