Begin typing your search above and press return to search.

సొంత ఎమ్మెల్యేపై వింత ప్ర‌చారం ఎక్క‌డంటే!

ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌కు వ్య‌తిరేకంగా త‌న అనుచ‌రుల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పంపించి.. వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నారని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:44 AM GMT
సొంత ఎమ్మెల్యేపై వింత ప్ర‌చారం ఎక్క‌డంటే!
X

రాజ‌కీయాలు నానా విధాలు. ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డిచేసే రాజ‌కీయాలు.. ఎత్తుల‌కు పై ఎత్తులు వేసే రాజ‌కీయా లు అంద‌రికీ తెలిసిందే. అయితే.. సొంత పార్టీల్లోనే వేరు కుంప‌ట్లు పెట్టుకున్న నాయ‌కులు, అధిష్టానం అండ ఉన్న నేతలు చేసే రాజ‌కీయాలు భిన్నంగా ఉంటున్నాయి. త‌మ హ‌వా పెంచుకునేందుకు చాప కింద నీరులా సొంత పార్టీ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్న ఘ‌ట‌న‌లు ఆస‌క్తిగా మారాయి.

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న రాజ‌కీయం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. గూడూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ 2019లో మాజీ ఐఏఎస్ వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బ‌ల్లి క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి నిర్ణ‌యించుకున్నారు. ఈయ‌న తండ్రి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావు తిరుప‌తి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో విజ‌యంద‌క్కించుకున్నారు.

అకాల మ‌ర‌ణంతో తిరుప‌తి పార్ల‌మెంటుకు ఉప ఎన్నిక వ‌చ్చిన విష‌యం తెలిసిందే. క‌ట్ చేస్తే.. దుర్గా ప్ర‌సాద్ త‌న‌యుడికి ఎంపీ టికెట్‌(ఉప ఎన్నిక‌లో) ఇవ్వ‌కుండా సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అయినా.. బ‌ల్లి క‌ళ్యాణ్‌కు మాత్రం సంతృప్తిగా లేద‌ట‌. ఈ క్ర‌మంలో గ‌తంలో గ‌త త‌న తండ్రి గెలిచిన గూడూరు నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేశారు. అయితే.. ఇక్క‌డ సిట్టింగ్ కూడా వైసీపీ నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌కు ఇబ్బంది వ‌చ్చింది.

పోనీ.. అధిష్టానం నుంచి ఏమైనా క‌ళ్యాణ్‌కు టికెట్ విష‌యంలో హామీ వ‌చ్చిందో లేదో తెలియాల్సి ఉంది. కానీ, ఈలోగా బ‌ల్లి క‌ళ్యాణ్ మాత్రం చాప‌కింద నీరులాగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌కు వ్య‌తిరేకంగా త‌న అనుచ‌రుల‌ను గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పంపించి.. వ్య‌తిరేక ప్ర‌చారం చేయిస్తున్నారని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ వృద్ధుడు అయిపోయార‌ని, అందుకే ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆయ‌న‌కు టికెట్ కూడా ఇవ్వ‌ర‌ని వ్య‌తిరేక ప్ర‌చారాన్ని జోరుగా సాగిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. ఈ వ్య‌తిరేక ప్ర‌చారంపై ఉప్పందుకున్న ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్‌.. క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌రా .. త‌న‌కే టికెట్ ఇస్తార‌ని.. అధిష్టానం త‌న‌పై న‌మ్మ‌కం ఉంచింద‌ని చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ విష‌యా న్ని పార్టీ అధిష్టానానికి చేర వేసేందుకు వ‌ర‌ప్ర‌సాద్ ప్ర‌య‌త్నిస్తున్నా.. ఫ‌లితం క‌నిపించ‌డం లేద‌ట‌. సో.. మొత్తానికి గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలోనే నాయ‌కులు ఇలా రోడ్డెక్క‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.