Begin typing your search above and press return to search.

జూదం పై జీఎస్టీ... అమలు ఎప్పటినుంచంటే...?

ఆన్‌ లైన్ గేమింగ్‌ తో పాటు క్యాసినో, గుర్రపు పందేలపై 28% జీఎస్టీని విధిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

By:  Tupaki Desk   |   10 Aug 2023 7:28 AM GMT
జూదం పై జీఎస్టీ... అమలు ఎప్పటినుంచంటే...?
X

అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే... ఆట పాట తీటా ఏదైనా జీఎస్టీ రూపంలో తాట కామన్ అంటున్నట్లుంది కేంద్రం! ఆదాయం సమకూర్చుకునే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలేది లేదని నిరూపించుకునే ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జూదంపై జీఎస్టీ 28శాతం విధించింది.

అవును... వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – జీఎస్టీ) పరిధిలోకి మరికొన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా... ఆన్‌ లైన్ గేమింగ్‌ తో పాటు క్యాసినో, గుర్రపు పందేలపై 28% జీఎస్టీని విధిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ రోజు మొత్తం పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో... సమావేశాల చివరి రోజు ఆగస్టు 11న లోక్‌ సభ లో ద్రవ్య బిల్లుగా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. అవును... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేయాలని కేంద్రం చూస్తోంది.

అయితే ద్రవ్యబిల్లులకు లోక్‌ సభ ఆమోదం సరిపోతుంది కాబట్టి ఈ బిల్లును గట్టెక్కించడం సమస్యే కాదని తెలుస్తోంది. పైగా... వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్న ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలు ద్వారా భారీ ఆదాయం సమకూరుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సానుకూలంగా స్వాగతించే అవకాశాలే ఎక్కువని అంటున్నారు.

ఈ తాజా బిల్లులో కాసినోల విషయంలో కొనుగోలు చేసిన చిప్‌ లు లేదా కాయిన్ల ముఖ విలువపైన.. గుర్రపు పందెం విషయంలో బుక్‌ మేకర్ లేదా టోటాలిజేటర్ పెట్టే పందెం పూర్తి విలువపైనా.. ఇక ఆన్‌ లైన్ గేమింగ్‌ లో బెట్టింగ్‌ పూర్తి విలువపైనా పన్ను వర్తింపజేయాలని ప్రతిపాదించారు.

ఆగస్టు 2న జరిగిన కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా... ఆగస్టు 11 న లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి అమలు జరిగేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆన్‌ లైన్ గేమింగ్, గుర్రపు పందాలను షెడ్యూల్ -3 లో పన్ను విధించదగిన లావాదేవీలుగా చేర్చడానికి చట్టంలో తగిన సవరణలు చేయాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.

2022-23లో ఆన్‌ లైన్ గేమింగ్ రంగం టర్నోవర్ రూ. 85 వేల కోట్లుగా నమోదైంది. అయితే ఈ రంగం నుంచి గతేడాది ప్రభుత్వం బెట్టింగ్ ట్యాక్స్, ఎంటర్‌టైన్మెంట్ ట్యాక్ రూపంలో కేవలం 2% అంటే రూ. 1,700 కోట్లు మాత్రమే ఆదాయాన్ని గడించింది. ఇదే సమయంలో కేసినోల నుంచి రూ. 800 కోట్లు, గుర్రపు పందాల నుంచి రూ. 80 కోట్లు వసూలయ్యాయి.

అయితే అది గతం... ఇప్పుడు వీటిపై కూడా 28శాతం జీఎస్టీ విధించడం వల్ల ప్రభుత్వం భారీగా ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా... ఒక్క ఆన్‌ లైన్ గేమింగ్ నుంచే ఏడాదికి రూ. 15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

కాగా... ఆన్‌ లైన్ గేమింగ్ కంపెనీలు, రేస్ కోర్సుల నుంచి 28% గరిష్ట పన్ను విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గేమింగ్ కంపెనీలు తమ పరిశ్రమ దారుణంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని సంస్థలు మూసేస్తున్నట్టు ప్రకటించగా, మరికొన్ని భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.