Begin typing your search above and press return to search.

వేల కోట్ల నోటీసులు... ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పై జీఎస్టీ కొరడా!

అనేక ఆన్‌ లైన్ గేమింగ్‌ కంపెనీలకు సుమారు రూ.55,000 కోట్ల పన్ను డిమాండ్‌ ను పెంచుతూ జీఎస్‌టీ ఇంటె లిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:57 AM GMT
వేల కోట్ల నోటీసులు... ఆన్‌  లైన్‌  గేమింగ్‌  పై జీఎస్టీ కొరడా!
X

వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ – జీఎస్టీ) పరిధిలోకి మరికొన్నింటిని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా... ఆన్‌ లైన్ గేమింగ్‌ తో పాటు క్యాసినో, గుర్రపు పందేలపై 28% జీఎస్టీని విధిస్తూ రూపొందించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆన్‌ లైన్‌ రియల్‌ మనీ గేమింగ్‌ కంపెనీలకు అధికారులు భారీ షాక్‌ ఇచ్చారు. దీంతో వ్యవహారం బొంబాయి హైకోర్టుకు చేరింది.

అవును... ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ ఫారం డ్రీం11 తన ప్లాట్‌ ఫారం పై పెట్టిన పందాలపై గత లావాదేవీలకు వర్తించే విధంగా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించింది. ఇలా రూ.55,000కోట్ల విలువైన ఫాంటసీ స్పోర్ట్స్ మేజర్ డ్రీం11కి రూ. 25 వేల కోట్ల పన్ను ఎగవేత నోటీసులు అందించడం కలకలం రేపింది. దీంతో డ్రీం11 బొంబాయి హైకోర్టును ఆశ్రయించింది.

అనేక ఆన్‌ లైన్ గేమింగ్‌ కంపెనీలకు సుమారు రూ.55,000 కోట్ల పన్ను డిమాండ్‌ ను పెంచుతూ జీఎస్‌టీ ఇంటె లిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ ప్రీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందులో, ముంబైకి చెందిన వ్యాపారవేత్త హర్ష్ జైన్, అతని స్నేహితుడు కో-ఫౌండర్‌ భవిత్ షేత్‌ కు చెందిన డ్రీం11 కు రూ. 25000 కోట్ల నోటీసు ఇవ్వడం కలకలం రేపింది.

ఈ సమయంలో జారీ అయిన షోకాజ్‌ నోటీసులపై బొంబాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన డ్రీం11... 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19 కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్‌ ఉందని పిటిషన్‌ లో డ్రీం11 పేర్కొంది. ఇదే సమయంలో స్పోర్ట్స్‌ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినదని, జూదం లేదా బెట్టింగ్‌ కు సంబంధించినది కాదని ఆ పిటిషన్‌ లో పేర్కొంది.

మరోపక్క దాదాపు 100 కంపెనీలు ఈ తరహా నోటీసులు అందుకోనున్నాయని, పన్ను డిమాండ్‌ విలువ మొత్తంగా రూ.లక్ష కోట్లకు పైగా ఉండొచ్చని అంటున్నారు. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌, హైదరాబాద్‌.. గతవారంలో క్యాసినోల నిర్వహణ సంస్థ డెల్టా కార్ప్‌ కు రూ.16,822 కోట్ల విలువైన రెండు పన్ను డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది.

ఇందులో డెల్టా కార్ప్‌ రూ.11,400 కోట్లు, డెల్టా కార్ప్‌ అనుబంధ విభాగాలైన క్యాసినో డెల్టిన్‌ డెంజాంగ్‌, హైస్ట్రీట్‌ క్రూయిజెస్‌, డెల్టా ప్లెజర్‌ క్రూయిసెస్‌ మొత్తం రూ.5,682 కోట్ల విలువైన పన్ను డిమాండ్‌ నోటీసులు పంపబడ్డాయి!

అక్టోబర్ 7న జీఎస్టీ మండలి భేటీ:

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ మండలి 52వ సమావేశం ఢిల్లీలో అక్టోబర్ 7న జరగనుంది. ఇందులో ప్రత్యేకంగా... ఆగస్టులో నిర్వహించిన సమావేశంలో ఆన్‌ లైన్‌ గేమింగ్‌ కు సంబంధించి అనుమతించిన స్టేట్‌ జీఎస్టీ చట్ట సవరణల సమీక్షే ప్రధానంగా ఈ సమావేశం జరగనుంది. ఆ ఎస్.జీఎస్టీకి అనుగుణంగా రాష్ట్రాలు చేపడుతున్న మార్పుల్లో పురోగతిని మండలి సమీక్షించనుందని తెలిసింది.