తగ్గిన జీఎస్టీ.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.2 లక్షలు ఆదా!
ఇప్పటివరకు నాలుగు పన్ను శ్లాబుల్లో లావాదేవీలు జరగగా, సవరించిన పన్ను విధానంతో ఇకపై రెండు శ్లాబుల్లోనే పన్నులు వసూలు చేయనున్నారు
By: Tupaki Desk | 24 Sept 2025 7:00 PM ISTజీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశంలో పలు రకాల వస్తువుల ధరలు భారీగా తగ్గాయి. ఇప్పటివరకు నాలుగు పన్ను శ్లాబుల్లో లావాదేవీలు జరగగా, సవరించిన పన్ను విధానంతో ఇకపై రెండు శ్లాబుల్లోనే పన్నులు వసూలు చేయనున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు 18 శాతం పన్ను పరిధిలో ఉన్న పలు వస్తువులు, సరుకుల ధరలను 5 శాతానికి తగ్గించడంతో ఆయా ధరలు భారీగా తగ్గాయి. ఇందులో ప్రధానంగా ఊబకాయం, మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలిగేలా మందుల ధరలు తగ్గాయి. దీంతో ఆయా రోగులు చికిత్సపై సగటున రూ.2 లక్షల మేరకు లబ్ధిపొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నెల 22 నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 12 శాతం పన్నులు విధించిన ఔషధాలను 5 శాతానికి తగ్గించారు. అంతేకాకుండా దాదాపు 36 రకాల మందులపై పన్నులను పూర్తిగా ఎత్తేశారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ప్రాణాపాయంలో చికిత్స పొందేవారికి మేలు జరగనుందని చెబుతున్నారు. ఇండియన్ ఫార్మస్యూటికల్ అలయన్స్ (IPA) చేసిన కేస్ స్టడీస్ ప్రకారం ఊబకాయం, మధుమేహం, నాన్ - ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులకు అలాగే క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు చికిత్స, మందులు కారుచౌకగా లభించనున్నాయి.
అదేవిధంగా అరుదైన వ్యాధులు, జన్యుపరమైన రుగ్మతలతో బాధపడేవారికి జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనం దక్కుతోందని చెబుతున్నారు. దేశంలో మొత్తం 140 కోట్లకు పైగా జనాభా ఉంటే ఇందులో సుమారు 72.6 మిలియన్ల అరుదైన వ్యాధిగ్రస్తులు ఉన్నారని ప్రభుత్వ లెక్కల ప్రకారం చెబుతున్నారు. వీరిలో చాలా మంది చికిత్స ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రైవేటు వైద్యం కూడా చౌకగా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన రుగ్మతలతో బాధపడేవారికి సుమారు 4 లక్షలు మిగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల మందులు, ల్యాబ్ పరీక్షలు, డయాగ్నస్టిక్స్ ఖర్చులు కూడా భారీగా తగ్గనున్నాయని చెబుతున్నారు.
