కొత్త జీఎస్టీ ఎఫెక్ట్....ఆగిపోయిన కొనుగోలులు
జీఎస్టీ స్లాబుల్లో కీలకమైన తగ్గింపులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానుండగా, వాహన మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 8 Sept 2025 4:46 PM ISTజీఎస్టీ స్లాబుల్లో కీలకమైన తగ్గింపులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానుండగా, వాహన మార్కెట్‌లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గనున్న వార్తలతో వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రస్తుతానికి షోరూమ్ యజమానులు ఎదుర్కొంటున్న పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఇప్పటివరకే ఖాళీగా ఉన్న షోరూమ్ హాల్స్, వాహనాల పై తగ్గింపు ధరల కోసం వినియోగదారులు వేచి చేస్తున్నారు. మరో వైపు వ్యాపారులు మాత్రం నష్టాలను ఎదుర్కొక తప్పేలా లేదు..
మధ్య తరగతి కుటుంబాల ఆసక్తి..
మధ్యతరగతి కుటుంబాలకు ప్రధానమైన మోటార్ బైక్ లు, కొత్త జీఎస్టీ స్లాబులతో మరింత దగ్గర కానున్నాయి. బైక్‌లపై 8,000 నుంచి 20,000 రూపాయల వరకు, కార్లపై 60,000 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు తగ్గింపు ఉంటుందనే అంచనాలతో ప్రస్తుత కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో వాహన షోరూమ్ యజమానుల పరిస్థితి దయనీయంగా మారింది.
వ్యాపారుల ఆందోళన
దసరా పండుగ సందర్భంగా వాహనాల అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. ఈ సందర్భంలో జీఎస్టీ తగ్గడంతో వ్యాపారులు ముందస్తు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కొంతమంది వినియోగదారులు తక్కువ ధర కోసం చివరి నిమిషం వరకు వేచి చూస్తుండడంతో షోరూమ్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీతో పండుగ సీజన్‌లో గతంలో మాదిరి వ్యాపారం సాగకపోవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కంపెనీల ప్రణాళికలు.. భవిష్యత్ వ్యూహాలు:
ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసిన పెద్ద వాహన ఉత్పత్తి సంస్థలు తాము తీసుకునే వ్యూహాలను మారుస్తూ జీఎస్టీ తగ్గింపులకు అనుగుణంగా సరఫరా చైన్‌ను మరింత సుదృఢం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి తగ్గింపుల కారణంగా తాత్కాలిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అయితే దసరా సీజన్ నుంచి అమ్మకాలు ఊపందుకుని మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయని ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
కొత్త జీఎస్టీతో గణనీయమైన మార్పులు
కొత్త జీఎస్టీ స్లాబులతో వాహన పరిశ్రమలో వినియోగదారుల ఆలోచన విధానాల్లో తీవ్ర మార్పులు తీసుకొస్తున్నది. దీని వల్ల షోరూమ్‌ల దగ్గర వాహన విక్రయాల సందడి కనిపించడం లేదు. అయితే దీర్ఘకాలికంగా ఇది వ్యాపార రంగానికి ప్రయోజనకరంగా మారే అవకాశమూ లేకపోలేదు. వినియోగదారులు ధర తగ్గింపులో తమ ప్రయోజనాలను చూసకుంటున్నారు. ఎలాగూ త్వరలో ధరలు తగ్గే అవకాశం ఉండడంతో మార్కెట్ లో కొత్త ఉత్సాహం రానుంది.ఇకపై సరఫరా వ్యవస్థను మరింత సక్రమంగా నిర్వహించడం, సమయానుసారంగా మద్దతుగా ఉండే ఆఫర్లను రూపొందించడం, తద్వారా వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడం కస్టమర్ ఫీల్డ్‌లో కీలకమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తం మీద, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రతికూల పరిస్థితులు, త్వరలో మారిపోనున్న మంచి అవకాశాల సూచనగా భావించవచ్చు.
