Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏలు సొంతపెత్తనం చేస్తున్నారా ?

నిజానికి ప్రభుత్వం లెక్కల ప్రకారం లబ్దిదారులకు అన్నీ పథకాలు వర్తించాలి. అయితే మధ్యలో ఎంఎల్ఏల పెత్తనంఏమిటో అర్ధంకావటంలేదు.

By:  Tupaki Desk   |   17 Aug 2023 5:38 AM GMT
ఎంఎల్ఏలు సొంతపెత్తనం చేస్తున్నారా ?
X

సంక్షేమపథకాల అమలులో కొందరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సొంతపెత్తనం చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అర్హులైన పేదలను ఆదుకునేందుకు సంక్షేమపథకాలను అమలుచేస్తోంది. నిజానికి పథకాల అమలులో ప్రభుత్వమే తల్లకిందులవుతోంది. ప్రకటించిన అన్నీ పథకాలను అమలుచేయటానికి నిధులు లేక, సరిపడా నిధులను సమీకరించటానికి కేసీయార్ కిందా మీదా అవుతున్నారు. రైతురుణమాఫీ హామీని పాక్షికంగా అమలుచేయటానికే కేసీయార్ పడుతున్న అవస్తలను అందరు చూస్తున్నదే.

ఇది సరిపోదన్నట్లుగా పథకాల అమలులో ఎంఎల్ఏలు సొంతంగా షరతులు విధించి పెత్తనం చేస్తున్నారట. అదేమిటంటే బీసీలకు లక్షరూపాయల ఆర్ధికసాయం, గృహలక్ష్మి పథకాల్లో ఏదో ఒకటే ఎంచుకోవాలని ఎంఎల్ఏలు బీసీ లబ్దిదారులకు చెబుతున్నారట.

లబ్దిదారుల ఎంపీకలో తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందే అని ఎంఎల్ఏలు అధికారులకు గట్టిగా చెబుతున్నారట. అలాగే దళితులకు దళితబంధు లేదా గృహలక్ష్మి పథకాల్లో ఏదో ఒకటే వర్తిస్తుందని చెబుతున్నారట.

నిజానికి ప్రభుత్వం లెక్కల ప్రకారం లబ్దిదారులకు అన్నీ పథకాలు వర్తించాలి. అయితే మధ్యలో ఎంఎల్ఏల పెత్తనంఏమిటో అర్ధంకావటంలేదు. ఇదే విషయమై పార్టీ నేతలు మాట్లాడుతు ప్రభుత్వం దగ్గర పథకాల అమలుకు సరిపడా నిధులు లేవని అంగీకరించారు. అందుకనే ఎక్కువమంది లబ్దిదారులను కవర్ చేయాలంటే పథకాల్లో లబ్దిదారులను పరిమితం చేయాలని కేసీయార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనంతమంది లబ్దిదారులను కవర్ చేయాలన్నది కేసీయార్ టార్గెట్. అయితే పథకాలన్నీ అందరు లబ్దిదారులకు వర్తింపచేసేందుకు సరిపడా నిధులు లేవన్న విషయం అందరికీ తెలిసిందే.

అందుకనే ఎంఎల్ఏల రూపంలో కేసీయారే తిరకాసు పెట్టిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించటంలేదట. చాలామంది నేతలు, కార్యకర్తలకు అన్నీ పథకాలూ వర్తిస్తున్నాయట. ఈ విషయం తెలిసి అసలైన లబ్దిదారులు ప్రభుత్వంపై మండిపోతున్నారట. నిజమైన లబ్దిదారులకు ఒకరూలు, పార్టీలో నేతలకు మరోరకమైన రూలా అంటు రెచ్చిపోతున్నారు. చివరకు ఈ విషయమే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులకు పూర్తిగా నెగిటివ్ అయిపోతుందేమో అనే టెన్షన్ కూడా పెరిగిపోతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.