Begin typing your search above and press return to search.

‘గ్రోక్’తో మస్క్ ను ‘గోకడం’ అంటే ఇదే..

టెక్ ప్రపంచంలో 'నేనే తోపు.. నా రూటే సపరేటు' అంటూ తిరిగే బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఇప్పుడు సొంత ఇంటనే గట్టి షాక్ తగిలింది.

By:  A.N.Kumar   |   9 Oct 2026 3:15 PM IST
‘గ్రోక్’తో మస్క్ ను ‘గోకడం’ అంటే ఇదే..
X

టెక్ ప్రపంచంలో 'నేనే తోపు.. నా రూటే సపరేటు' అంటూ తిరిగే బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు ఇప్పుడు సొంత ఇంటనే గట్టి షాక్ తగిలింది. పక్కవాడి మీదకు ఏఐ కుక్కలను వదులుదామని చూస్తే.. అది తిరిగొచ్చి ఆయన ప్యాంట్ పట్టుకున్నంత పనైంది. భారత్‌లో తన కలల ప్రాజెక్ట్ 'స్టార్‌లింక్' శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వేగంగా ప్రారంభించాలని మస్క్ కంకణం కట్టుకుంటే ఆయన సొంత ఎక్స్ ఏఐకి చెందిన 'గ్రోక్' చాట్‌బాట్ మాత్రం "ఆగండ్రోయ్.. స్టార్‌లింక్ వస్తే భారత దేశ భద్రతకే ముప్పు" అని సెల్ఫ్ గోల్ వేసేసింది. దీంతో నెటిజన్లు “గ్రోక్‌తో మస్క్‌ను గోకడం అంటే ఇదేరా భాయ్” అంటూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు.





‘స్టార్‌లింక్’ ఆశలపై సొంత ఏఐ ‘నీళ్లు’

మారుమూల గ్రామాలు, కొండలు, కోనల్లోనూ అద్భుతమైన ఇంటర్నెట్ అందిస్తామని మస్క్ బాబాయ్ పదే పదే చెప్తున్నారు. భారత మార్కెట్ పెద్దది కాబట్టి ఇక్కడ జెండా పాతాలని స్పేస్‌ఎక్స్ గట్టిగానే ట్రై చేస్తోంది. అయితే భారత సరిహద్దు ప్రాంతాలు అత్యంత సున్నితమైనవి. అక్కడ నెట్‌వర్క్ ఎవరి చేతిలో ఉందో ఎవరు వాడుతున్నారో తెలియకపోతే తీవ్రమైన సైబర్, నిఘా ముప్పులు ఏర్పడే అవకాశముంది.

ఇదే విషయాన్ని నెటిజన్లు గ్రోక్ ఏఐని అడిగితే.. అది అస్సలు మొహమాటం లేకుండా.. సొంత ఓనర్ ఎలన్ మస్క్ ను ‘కూరలో కరివేపాకులా’ తీసేస్తూ.. "అవును మరి సరైన నిబంధనలు, పర్యవేక్షణ లేకపోతే స్టార్‌లింక్ వల్ల భారత్ భద్రతకు పెద్ద విఘాతమే కలుగుతుంది" అని సుదీర్ఘమైన సుభాషితాలు చెప్పేసింది. ఓనర్ అయితే నాకేంటి అని ఏ గ్రోక్ చాట్ బట్ ముఖం మీదే చెప్పేసింది. మస్క్ కంపెనీ పరువును ఆయన ఏఐ చాట్‌బాటే బజార్లో పెట్టడంతో టెక్ ప్రియులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

విభేదాలు కావు.. పప్పులో కాలేసిన ‘గ్రోక్’

అయితే మస్క్ కంపెనీల మధ్య ఏమైనా అంతర్గత యుద్ధం నడుస్తోందా అంటే.. అదేమీ లేదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటర్నెట్‌లో లభించే డేటాను, లీగల్ విశ్లేషణలను బట్టి సమాధానం ఇస్తుంది తప్ప యజమాని బిజినెస్ లాభాలను చూసి పెంచుకున్న కుక్కలాగా ప్రత్యర్థులపై అరవదు కదా.. ఏఐ చాట్‌బాట్‌లు ఇచ్చే ప్రతిదీ అధికారిక ప్రకటన కాకపోయినా ఈ సంఘటన మాత్రం మస్క్‌కు తీవ్రమైన ఇబ్బందికర పరిణామంగా మారింది.

భారత్‌కు వ్యాపారం కంటే ‘దేశ భద్రత’ ముఖ్యం

తమాషా పక్కన పెడితే గ్రోక్ లేవనెత్తిన పాయింట్ మాత్రం చాలా సీరియస్ అయినది. డిజిటల్ ఇండియా విస్తరణకు శాటిలైట్ ఇంటర్నెట్ మంచిదే అయినప్పటికీ దేశ భద్రత విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడదు. సరిహద్దుల్లో అనుమతి లేని కమ్యూనికేషన్లు, ఉగ్రవాద చర్యలకు సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండాలంటే లోకల్ డేటా సర్వర్లు, కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థలు తప్పనిసరి.

మస్క్ మామ తన స్టార్‌లింక్‌ను భారత్‌లోకి తెచ్చే లోపు ముందు తన 'గ్రోక్' నోటికి కొంచెం లాక్ వేసుకోవడం లేదా సరైన శిక్షణ ఇవ్వడం నేర్చుకోవాలేమో.. వ్యాపార ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే భారత్‌కు ప్రాతిపదిక. అదే గ్రోక్ గోకేసింది.. మస్క్ మామ వింటాడో లేదో చూడాలి మరీ..