Begin typing your search above and press return to search.

గాజాకు వెళ్తున్న నౌకను అడ్డగించిన ఇజ్రాయెల్.. ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ కిడ్నాప్

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:01 AM IST
గాజాకు వెళ్తున్న నౌకను అడ్డగించిన ఇజ్రాయెల్.. ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ కిడ్నాప్
X

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. గాజా ప్రాంతానికి మానవతా సహాయం తీసుకెళ్తున్న ఒక నౌకలో ఆమె వెళ్తుండగా ఇజ్రాయెల్ బలగాలు తమను కిడ్నాప్ చేశాయని గ్రెటా స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వార్త బయటికి రాగానే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి షాక్ తగిలింది. గ్రెటా థన్‌బర్గ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఇలా చెప్పారు.. "నా పేరు గ్రెటా థన్‌బర్గ్, నేను స్వీడన్ దేశం నుండి వచ్చాను. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఇజ్రాయెల్ దేశం లేదా దానికి సపోర్ట్ చేసే సైనిక బలగాలు మమ్మల్ని అంతర్జాతీయ సముద్ర జలాల్లో అడ్డగించి కిడ్నాప్ చేశాయి. దయచేసి నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అంతా స్వీడిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. నన్ను, నాతో ఉన్న మిగతా వాళ్లను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను." అంటూ చెప్పుకొచ్చారు.

'డైలీ మెయిల్' అనే పత్రిక ప్రకారం.. 'మాడ్లీన్' (Madleen) అనే ఈ నౌకను అనేక ఇజ్రాయెల్ నౌకలు చుట్టుముట్టాయి. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది వెంటనే డేంజర్ బెల్ మోగించారు. 'ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి' అనే సంస్థ, గాజాకు వెళ్తున్న తమ నౌకను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుందని ధృవీకరించింది. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటోలో నౌకలోని సిబ్బంది లైఫ్‌జాకెట్లు ధరించి, చేతులు పైకెత్తి కూర్చుని కనిపించారు. అయితే, ఆ ఫోటోలో ఇజ్రాయెల్ సైనికులు ఎవరూ లేరు.

ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి ఇంతకు ముందు నౌకపై 'దాడి' జరిగిందని చెప్పింది. మాడ్లీన్ నౌకతో మా కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇజ్రాయెల్ సైన్యం నౌకలోకి ప్రవేశించింది" అని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి తెలిపింది. " డ్రోన్‌లు నౌకను చుట్టుముట్టి, తెలుపు రంగు పెయింట్ లాంటి పదార్థాన్ని దానిపై స్ప్రే చేశాయి. మా కమ్యూనికేషన్లు పూర్తిగా ఆగిపోయాయి, రేడియోలో వింత శబ్దాలు వినిపించాయి" అని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో వివరాలు చెప్పింది.

ఇజ్రాయెల్ ఏం చెబుతోంది?

గాజాకు వెళ్తున్న సహాయ పడవలను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ముందు నుంచీ చెబుతోంది. "ఆ 'మాడ్లీన్' ఫ్లోటిల్లాను గాజాకు చేరనివ్వకుండా చూడాలని నేను ఇజ్రాయెల్ రక్షణ దళాలకు (IDF) ఆదేశాలిచ్చాను" అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం అన్నారు. 'ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి'కి చెందిన జర్మనీలో పనిచేస్తున్న ప్రెస్ ఆఫీసర్ మహమూద్ అబూ-ఒడె, "కార్యకర్తలు అరెస్ట్ అయినట్లు అనిపిస్తుంది" అని చెప్పారు.

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంపై స్పందించింది. ఆ నౌక నియంత్రిత ప్రాంతానికి దగ్గరగా వస్తుందని, అందుకే దాని దారి మార్చుకోవాలని తమ నావికాదళం ఆదేశించిందని పేర్కొంది. "ఆ నౌకలో ఉన్న ప్రయాణికులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది" అని మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో రాసింది. యాచ్‌లో ఉన్న సహాయ సామాగ్రి, మానవతా మార్గాల ద్వారా గాజాకు పంపిస్తాం" అని కూడా ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది.