Begin typing your search above and press return to search.

భారీ పెట్టుబడులు: ఏపీలో గ్రీన్ ఎనర్జీపై రిలయన్స్ ఫోకస్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రిలయన్స్ భారీగా ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 4:21 AM GMT
భారీ పెట్టుబడులు: ఏపీలో గ్రీన్ ఎనర్జీపై రిలయన్స్ ఫోకస్
X

ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ముందుకు వచ్చింది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రిలయన్స్ భారీగా ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రూ.1920 కోట్ల పెట్టుబడితో 15 చోట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది.

తొలిదశలో ఎనిమిది యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ప్రత్యక్షంగా.. పరోక్షంగా దాదాపు 2 వేలకు పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెబుతున్నారు. ఇంతకూ ఈ గ్రీన్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేస్తారు? అన్న విషయానికి వస్తే.. వ్యవసాయ వ్యర్థాలు.. వరిగడ్డి.. వేరుశనగ పొట్టు.. జొన్న కంకులు.. ఖాళీ కొబ్బరి బోండాలు.. చెరకుపిప్పి.. మునిసిపాలిటీల నుంచి రోజూ వారీగా వచ్చే వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తారు.

వీటితో పర్యావరణహిత గ్యాస్ మాత్రమే కాదు.. సేంద్రియ ఎరువుల్ని తయారు చేసే వీలుంది. రైతులు తమ పంట వ్యర్థాల్ని పోలాల్లోనే తగలబెడుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది. తాజాగా ఏర్పాటు చేస్తున్న యూనిట్లతో రైతుల వద్ద నుంచే నేరుగా రిలయన్స్ ఈ వ్యర్థాల్ని కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ వ్యర్థాల్ని కొనుగోలు చేయటం ద్వారా దాదాపు 70 వేల మంది రైతులకు మేలు జరిగే వీలుందని చెబుతున్నారు. ప్రతి రైతుకు ఏటా అదనంగా రూ.6250 చొప్పున అదనపు ఆదాయం లభించే వీలుందని అంచనా వేస్తున్నారు.

ఈ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలకు అదనంగా రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు పెట్టుబడులు వచ్చే వీలుంది. అంతేకాదు.. వీటి ఏర్పాటుతో కర్బన ఉద్గారాలు తగ్గటంతోపాటు.. సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో భారీగా విదేశీ మారకద్రవ్యం లభించే వీలుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న లిక్విడ్ నేచురల్ గ్యాస్ (అదేనండి ఎల్ పీజీ).. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ)కి ప్రత్యామ్నాయంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ)లు రానుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

ఒక్క రిలయన్స్ మాత్రమే కాదు అదానీ సైతం ఈ రంగం మీద ఫోకస్ పెడుతోంది. రిలయన్స్ అనుబంధ కంపెనీ రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా రానున్న ఐదేళ్లలో దాదాపు 100 సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో 15 యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తారు. ఒక్కోయూనిట్ ను 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. తొలిదశలో కాకినాడ జిల్లాలో మూడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద రెండు.. విజయవాడ పరిటాల వద్ద ఒకటి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. కర్నూలు జిల్లాల్లోనూ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తారు.