Begin typing your search above and press return to search.

రూ. కోట్లలో లంచాలు.. గ్రీన్ కార్డుల విక్రయం.. మాజీ యూఎస్.సీఐఎస్ అధికారి దొరికాడిలా..

అమెరికా కలని నిజం చేసుకోవడం ఇంత తేలికా.. టోఫెల్ రాయక్కర్లేదు.. ఇంటర్వ్యూకి వెళ్లక్కర్లేదు.. కనీసం మీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ కూడా అవసరం లేదు.. కేవలం 'చాట్ అండ్ క్యాష్' మోడల్‌తో గ్రీన్ కార్డులు కట్టబెట్టేసే ఒక స్వచ్ఛంద "ఇమ్మిగ్రేషన్ సెంటర్"ను అమెరికా ఫెడరల్ అధికారులు హఠాత్తుగా మూసేశారు

By:  Tupaki Desk   |   8 Sept 2026 8:58 AM IST
రూ. కోట్లలో లంచాలు.. గ్రీన్ కార్డుల విక్రయం.. మాజీ యూఎస్.సీఐఎస్ అధికారి దొరికాడిలా..
X

అమెరికా కలని నిజం చేసుకోవడం ఇంత తేలికా.. టోఫెల్ రాయక్కర్లేదు.. ఇంటర్వ్యూకి వెళ్లక్కర్లేదు.. కనీసం మీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ కూడా అవసరం లేదు.. కేవలం 'చాట్ అండ్ క్యాష్' మోడల్‌తో గ్రీన్ కార్డులు కట్టబెట్టేసే ఒక స్వచ్ఛంద "ఇమ్మిగ్రేషన్ సెంటర్"ను అమెరికా ఫెడరల్ అధికారులు హఠాత్తుగా మూసేశారు. క్యూలో నిలబడి.. ఏళ్ల తరబడి వేచి చూసే పిచ్చివాళ్లంతా ఒకవైపు ఉంటే.. వాట్సాప్‌లో మెసేజ్ కొట్టి జెల్లే లో డాలర్లు పంపగానే గ్రీన్ కార్డు హోమ్‌ డెలివరీ చేసేసే ఈ మహాదాతను.. ఆయన 'క్యాష్ యాప్' పార్ట్‌నర్‌ను అర్థాంతరంగా అరెస్ట్ చేసి అధికారులు ఆ అమాయక "సేవలకు" విఘాతం కలిగించారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఒక భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని అక్రమంగా గ్రీన్ కార్డులు.. అమెరికా పౌరసత్వం కట్టబెడుతున్నారనే తీవ్ర ఆరోపణలపై యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) మాజీ సీనియర్ అధికారి లుక్మన్ ఒవోలాబి గనియును ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు సహకరించిన అడెనియి అకీమ్ సోమోయే అనే మరో వ్యక్తిని కూడా సెప్టెంబర్ 2న అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అవినీతి నెట్‌వర్క్.. అసలు ఏం జరిగింది?

ఫెడరల్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. 2019 డిసెంబర్ నుండి 2026 మార్చి వరకు గనియు తన అధికారిక హోదాను తీవ్రంగా దుర్వినియోగం చేశారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్లు.. నేరుగా నిర్వహించే ఫెడరల్ ఇంటర్వ్యూలు, సూపర్‌వైజర్ల పర్యవేక్షణ వంటి ప్రామాణిక నిబంధనలను పక్కనపెట్టి లంచాలు చెల్లించిన దరఖాస్తుదారులకు వేగంగా ఆమోదముద్ర వేశారు. ఈ అక్రమ వ్యవహారంలో సోమోయే మధ్యవర్తిగా వ్యవహరిస్తూ దరఖాస్తుదారుల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు విచారణలో తేలింది. వీరిద్దరి మధ్య దరఖాస్తుల వేగవంతం, లంచాల వసూళ్లపై విస్తృతంగా వాట్సాప్ సంభాషణలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి.

అకౌంట్లలో రూ. కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు

దర్యాప్తు పత్రాల ప్రకారం.. గనియు బ్యాంకింగ్ లావాదేవీలపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించారు. ఎలాంటి సరైన వివరణ లేని 2,87,830 డాలర్ల నగదు ఆయన ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. జెల్లీ , క్యాష్ యాప్ వంటి యాప్‌ల ద్వారా మరో 6,71,438 డాలర్ల చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఈ మొత్తంలో అత్యధిక భాగం ఇమ్మిగ్రేషన్ లబ్ధిదారుల నుంచే వచ్చినట్లు ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించింది. 2018 నవంబర్‌లో యూఎస్.సీఐఎస్ లో చేరిన గనియు, కాన్సాస్, టెక్సాస్, నార్త్ కరోలినాల్లో సేవలందించారు. 2024 ఏప్రిల్‌లో డల్లాస్‌లో సీనియర్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందిన ఆయన 2026 మార్చి 21న హఠాత్తుగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు.

నిందితుడి ఖండన.. కఠిన షరతులతో బెయిల్

ఈ ఆరోపణలను గనియు తరఫు న్యాయవాది అల్ఫోన్సో కబానాస్ పూర్తిగా తోసిపుచ్చారు. తన క్లయింట్ ఎలాంటి నేరానికి పాల్పడలేదని.. ఫెడరల్ ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక లావాదేవీల లెక్కలు సత్యదూరమని వాదించారు. విచారణ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచాలని ప్రాసిక్యూటర్లు కోరినప్పటికీ కోర్టు కొన్ని కఠిన నిబంధనలతో గనియుకు బెయిల్ మంజూరు చేసింది. జీపీఎస్ ట్రాకింగ్, ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో పాటు ఆయన వద్ద ఉన్న అమెరికా, నైజీరియా పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది.

ఈ నేరం నిరూపితమైతే ఇద్దరు నిందితులకు ఐదేళ్ల వరకు ఫెడరల్ జైలు శిక్షతో పాటు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లకు పైగా) జరిమానా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం యూఎస్.సీఐఎస్ ఆఫీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ డల్లాస్ ఫీల్డ్ ఆఫీస్ సంయుక్తంగా ఈ కేసును తదుపరి విచారణ చేస్తున్నాయి.