గ్రీన్ కార్డ్ తిరస్కరణ: చిన్న తప్పుకు భారీ మూల్యం
ఓ అభ్యర్థి గ్రీన్ కార్డ్ , పని అనుమతి దరఖాస్తులను USCIS (US Citizenship and Immigration Services) తిరస్కరించింది.
By: Tupaki Desk | 4 Jun 2025 9:06 PM ISTఅమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ ఆ కల ఒక్క చిన్న పొరపాటుతో ఎలా అస్తవ్యస్తంగా మారుతుందో తెలియజెప్పే సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే, ఒక అభ్యర్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, అమెరికా వలస విధానాల క్లిష్టతను కళ్ళముందుంచారు.
ఓ అభ్యర్థి గ్రీన్ కార్డ్ , పని అనుమతి దరఖాస్తులను USCIS (US Citizenship and Immigration Services) తిరస్కరించింది. కారణం అతడు తాజా పన్ను రిటర్న్‌ను సమర్పించలేదని. అయితే, అభ్యర్థి గత సంవత్సరం దరఖాస్తు చేసేటప్పుడు అన్ని పత్రాలను సమర్పించామని గట్టిగా చెబుతున్నారు. ఈ ఒక్క కారణంతో వారు స్టేటస్‌ను సవరించుకునే అర్హతను కోల్పోయారు. గ్రీన్ కార్డ్ లేకుండా పని అనుమతి లేకుండా, ఇప్పుడు దేశం విడిచిపోవాల్సిన ప్రమాదంలో పడ్డారు.
ఇది ఏదో ఒక్కరికే జరిగిన ఘటన కాదు. కుటుంబ సభ్యుల ద్వారా వలస అనుమతి పొందుతున్న చాలామంది అభ్యర్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సమర్పించిన ఆర్థిక పత్రాలు తప్పుగా ఉన్నాయని లేదా “తప్పిపోయాయి” అనే కారణాలతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. USCIS ప్రతి పేజీ, ప్రతి వివరాన్ని వారి ప్రాధాన్యతకనుగుణంగా..తాజా పన్ను సంవత్సరానికి సంబంధించిన డేటా ఉండాలని స్పష్టం చేస్తోంది.
ఈ వివరాలన్నీ అభ్యర్థులకు తెలిసే వరకు చాలా ఆలస్యం అవుతోంది. అప్పటికి వారి ముందున్న ఒకే ఒక్క మార్గం పునరుద్ధరణ కోసం మళ్లీ దరఖాస్తు చేయడం లేదా వేలాది డాలర్లు ఖర్చుచేసి న్యాయ సహాయం పొందడం. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకునేది.. ఖర్చుతో కూడుకున్నది.
అందుకే, గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసేటప్పుడు చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకుండా అత్యంత జాగ్రత్త వహించాలి. సమర్పించే ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించాలి, అవసరమైనచోట్ల న్యాయ సలహా తీసుకోవడం మంచిది. లేదంటే జీవితంలో చాలా కీలకమైన అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. USCIS నియమాలు కఠినమైనవే కావచ్చు, కానీ వాటిని అర్థం చేసుకుని, పకడ్బందీగా వ్యవహరిస్తేనే గ్రీన్ కార్డ్ కల నెరవేరుతుంది.
