షార్ట్ కట్ కోసం ఏకంగా చైనా గ్రేట్ వాల్ ను తవ్వేశారు
చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్ యుయు కౌంటీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు 32 గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు దగ్గర్లోని ఒక నిర్మాణ పని కాంటాక్టు లభించింది
By: Tupaki Desk | 6 Sept 2023 2:16 PM ISTతమ అవసరం తప్పించి మరింకేమీ పట్టని కొందరుంటారు. ఇలాంటి వారు.. తమకు ఇబ్బంది లేకుండా ఉండటానికి మిగిలిన వారిని ఎంత ఇబ్బందికి గురి చేయటానికి కూడా వెనుకాడరు. ఇంచుమించు అలాంటి తీరునే ప్రదర్శించింది చైనా జంట ఒకటి. తాము ప్రయాణించాల్సిన దూరం పెరుగుతుందన్న కారణంగా.. షార్ట్ కట్ కోసం ప్రపంచ వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఒకచోట తవ్వేసిన వైనం తెలిస్తే షాక్ తినాల్సిందే. బరి తెగింపునకు పీక్స్ అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..
చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్ యుయు కౌంటీకి చెందిన ఇద్దరు వ్యక్తులకు 32 గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు దగ్గర్లోని ఒక నిర్మాణ పని కాంటాక్టు లభించింది. ఈ పని పొందిన ఇద్దరిలో ఒకరు 55 ఏళ్ల మహిళ అయితే మరొకరు 38 ఏళ్ల వ్యక్తి. వీరిద్దరు తామున్న ప్రదేశం నుంచి కాంటాక్టు పొందిన ప్లేస్ కు వెళ్లాలంటే మధ్యలో 32 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడం ఉంది. దీంతో.. వారు చాలా కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది.
అయితే.. 32 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడాన్ని తవ్వేస్తే.. వారికి దూరం భారీగా తగ్గిపోతుంది. అంత దూరం ప్రయాణించటం రోజు కావటంతో టైం తో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అందుకే.. వెనుకా ముందు చూసుకోకుండా ప్రపంచ వింతల్లో ఒకటైన ఆ గోడను తవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకు అనువైన ప్రదేశం కోసం గాలించగా.. వారికి ఒకచోట సందు లాంటి ప్రదేశం కనిపించింది. ఆ వెంటనే.. దాన్ని వాహనాలు వెళ్లేంత సైజులో తవ్వేశారు. దీంతో.. వారు వెళ్లాల్సిన ప్లేస్ కు షార్ట్ కట్ వచ్చేసింది.
ఇదంతా బాగానే ఉన్నా.. వీరి ఆరాచకాన్ని స్థానికులు కొందరు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. చైనా సమగ్రతకు.. ప్రతిష్ఠకు నిలువెత్తు రూపంగా నిలిచే చారిత్రక గోడను కూల్చేయటం చూసి కంగుతిన్నారు. ప్రసిద్ధ కట్టటాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం తవ్వేస్తారా? అంటూ సీరియస్ అయ్యారు. ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకోగా..తాము చేసిన తప్పును ఒప్పుకుంటూ.. సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుందని తమ పనిని సమర్థించుకున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
