మెగా విశాఖ దిశగా జీవీఎంసీ? మున్సిపల్ ఎన్నికలు డౌటేనా?
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖ పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 8 Dec 2025 6:00 AM ISTరాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖ పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. పెందుర్తి, భీమిలి ఎమ్మెల్యేలు రాసిన లేఖలతో ప్రస్తుతం ఉన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 84 గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వురుగా రాసిన లేఖలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఎమ్మెల్యేల సూచనలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మున్సిపల్ అడ్మినస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు సమీపంలో ఉన్న పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లోని ఆయా మండలాల గ్రామాలతోపాటు పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని గ్రామాలను జీవీఎంసీ పరిధిలోకి తేవాలని ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి లేఖ రాశారని సమాచారం. నిజానికి ఈ నాలుగు మండలాల్లోని గ్రామాలను గతంలోనే జీవీఎంసీలో కలపాలని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అప్పట్లో సుమారు 84 గ్రామాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ 84 గ్రామాలను జీవీఎంసీలో కలపాలనే ప్రతిపాదనను గత ప్రభుత్వం విరమించుకుంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో విలీన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఏపీ ఐటీ క్యాపిటల్ గా విశాఖను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విశాఖను ఏఐ డేటా సెంటర్ల హబ్ గా ప్రకటించింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త ఐటీ పరిశ్రమలు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కాగ్నిజెంట్, టీసీఎస్ తమ సర్వీసు సెంటర్లను ప్రారంభిస్తున్నాయి. దీంతో జీవీఎంసీని మరింత విస్తరించాలనే ప్రతిపాదన ఆసక్తి రేపుతోంది. ఆయా గ్రామాల ప్రజలు కూడా జీవీఎంసీలో విలీనానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జీవీఎంసీ 682 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సుమారు 21 లక్షల మంది జనాభా ఉన్నారు. 98 డివిజన్లతో విస్తరించిన జీవీఎంసీని మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు సూచించిన 84 గ్రామాలను గ్రేటర్ విశాఖలో కలిపితే మరో 4 లక్షల జనాభా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ గా విస్తరించాలని 20 ఏళ్ల కిందట ప్రభుత్వం భావించింది. గాజువాక మున్సిపాలిటీతోపాటు పెందుర్తి మండలంలో కొన్ని గ్రామాలను అప్పట్లో కార్పొరేషన్ లో విలీనం చేసింది.
అదేవిధంగా విశాఖ నగర శివార్లలో ఉన్న మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది పరిసర ప్రాంతాలను విశాఖలో కలుపుతూ జీవీఎంసీ ఏర్పాటు చేశారు. ఇక 2011లో విశాఖను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలను ఆ పక్కనున్న గ్రామాలను విలీనం చేశారు. అయితే భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు జీవీఎంసీలో కలిసినా, వాటికి సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీలు మాత్రం అభ్యంతరం చెప్పాయి. దీంతో వాటిని వదిలేసి భీమిలి, అనకాపల్లిని కలుపుతూ జీవీఎంసీని 98 డివిజన్లుగా పునర్వ్యస్థీకరించారు.
ఇక 2020లో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది మార్చి 17తో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. తాజాగా మెగా విశాఖ ప్రతిపాదన తెరపైకి రావడం, ప్రభుత్వం కూడా ఆ ప్రతిపాదనకు సానుకూలంగా ఉండటంతో కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం విలీన ప్రక్రియ చేపడితే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదని అంటున్నారు. దీంతో జీవీఎంసీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, గంటా శ్రీనివాసరావుల ప్రతిపాదనల ప్రకారం ఆయా గ్రామాలు గ్రేటర్ విశాఖలో విలీనమైతే విశాఖ జిల్లా మొత్తం కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందని అంటున్నారు.
