విస్తరణలోనూ గ్రేటర్ కు హ్యాండిచ్చారు
అవును.. ఎంతో ఆశగా ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు ఈసారీ నిరాశ తప్పలేదు.
By: Tupaki Desk | 9 Jun 2025 10:45 AM ISTఅవును.. ఎంతో ఆశగా ఎదురుచూసిన మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్ కు ఈసారీ నిరాశ తప్పలేదు. రేవంత్ ప్రభుత్వంలో గ్రేటర్ ప్రాతినిధ్యం లేకపోవటం షాకింగ్ గా మారుతోంది. హైదరాబాద్ మహానగర పరిధిలో హైదరాబాద్.. రంగారెడ్డి..మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో 25 శాతం స్థానాల వరకు ఈ మూడు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి.
రాష్ట్ర జనాభాలో 40 శాతం వరకు ఈ జిల్లాల్లోనే ఉన్నారు. అలాంటి వేళ.. వీరికి ప్రాతినిధ్యం వహించేలా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. కానీ.. ఈసారీ నిరాశే ఎదురైంది. రేవంత్ సర్కారులో మాత్రం కేబినెట్ లో ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా ఫోకస్ చేయలేదంటున్నారు. తొలి దఫా అవకాశం లభించనప్పటికీ.. విస్తరణలో ఈ జిల్లాలకు అవకాశం ఉంటుందని భావించారు. దీనికి తోడు ఇద్దరు.. ముగ్గురు నేతలు బలంగా ప్రయత్నించారు. అయినప్పటికీ విస్తరణలో చోటు దక్కలేదు.
ఎక్కువ జిల్లాలు.. అందునా జనాభా ఎక్కువగా ఉన్న చోటు మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం కోసం సీనియర్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఆయన గుర్రుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి ఆయన్నువ్యక్తిగతంగా కలిసి.. భవిష్యత్తులో పదవులు వస్తాయని.. వెయిట్ చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. ప్రత్యేక రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు వరకు గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రివర్గంలో ఖాయంగా చోటు లభించేది. అందుకు భిన్నంగా తొలిసారి ప్రాతినిధ్యం లేకుండాపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ మహానగరానికి మంత్రివర్గంలో చోటు లేకపోవటం ద్వారా.. పార్టీ బలోపేతానికి ఉండే అవకాశాల్ని పోగొట్టుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.