Begin typing your search above and press return to search.

'గ్రేట్ గ్రీన్ వాల్'... ఈ అద్భుతం గురించి తెలుసుకోవాల్సిందే..!

'గ్రేట్ గ్రీన్ వాల్' అనేది ఆఫ్రికాలోని సెనెగల్ నుంచి జిబౌటీ వరకూ కేవలం చెట్లతోనే 8,000 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఓ గోడ!

By:  Tupaki Desk   |   28 July 2025 8:45 AM IST
గ్రేట్ గ్రీన్ వాల్... ఈ అద్భుతం గురించి తెలుసుకోవాల్సిందే..!
X

'గ్రేట్ గ్రీన్ వాల్' అనేది ఆఫ్రికాలోని సెనెగల్ నుంచి జిబౌటీ వరకూ కేవలం చెట్లతోనే 8,000 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఓ గోడ! పొడి భూములలో విస్తారమైన చెట్లు, వృక్షసంపద, సారవంతమైన భూమిని పెంచడానికి చేపట్టబడిన ఓ అద్భుత అంతర్జాతీయ ప్రయత్నం. ఇది ఆఫ్రికాలో క్షీణించిన ప్రకృతి దృశ్యాలను తిరిగి జీవం పోస్తోంది.. ప్రజలకు తిరిగి సారవంతమైన భూమిని అందిస్తుంది.

అవును... 2007లో ఆఫ్రికాలో ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ని ప్రారంభించారు. ఇది కేవలం 8,000 కిలోమీటర్ల గోడ మాత్రమే కాదు. దీని లక్ష్యం... జీవవైవిధ్యాన్ని పెంచడం, భూమిని రక్షించడం, పోషకమైన ఆహారాన్ని పెంచడం, దాని మార్గంలో నివసిస్తున్న లక్షలాది మందికి ఉద్యోగాలను సృష్టించడం. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ 2030 నాటికి పూర్తవుతుందని అంటున్నారు.

ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజూ వాతావరణ సంక్షోభ ప్రభావాలతో జీవిస్తున్నారు. ప్రధానంగా భూమి దాని సారాన్ని వేగంగా కోల్పోతోంది. ఫలితంగా... ప్రజలు తగినంత ఆహారాన్ని పండించలేకపోవడంతో.. పేదరికం పెరుగుతోంది. లక్షలాది మంది ఉపాధి లేక, ఆకలితో అలమటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో గ్రేట్ గ్రీన్ వాల్ వీటన్నింటికీ పరిష్కారం అని చెబుతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిజం చేయడానికి ఆఫ్రికన్ యూనియన్, యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ (యూ.ఎన్.సీ.సీ.డీ) కలిసి పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో... 2030 నాటికి ఈ ఉద్యమం ఆఫ్రికా అంతటా 100 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని.. అదేవిధంగా 10 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదే సమయంలో... 250 మిలియన్ టన్నుల కార్బన్‌ ను వేరుచేయడం.. 20 మిలియన్ల మందికి ఆహార భద్రతను మెరుగుపరచడం.. సహెల్ అంతటా కమ్యూనిటీలలో నివసిస్తున్న లక్షలాది మందికి మద్దతు ఇవ్వడంతో పాటు వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను 10 మిలియన్ల చిన్నకారు రైతులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

కాగా... భారతదేశం కూడా ఓ భారీ గోడను నిర్మించబోతోందంటూ ఇటీవల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గుజరాత్, రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ వరకూ విస్తరించేలా ఉండే ఈ గోడా పొడవు సుమారు 1,400 కి.మీ. ఉంటుందని అంటున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాలను, ఆరావళి పర్వత శ్రేణిని మళ్లీ పచ్చగా మార్చడమే దీని ఉద్దేశ్యంగా చెబుతున్నారు.

ఈ భారీ గోడను గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి ఢిల్లీలోని మహాత్మగాంధీ సమాధి రాజ్ ఘాట్ వరకూ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 1.15 మిలియన్ హెక్టార్లకు పైగా అడవుల పునరుద్ధరణ, చెట్లను నాటడం, వ్యవసాయ యోగ్యమైన భూమి, నీటి వనరుల పునరుద్ధరణ జరుగుతుందని.. 5 కి.మీ వెడల్పు గల గ్రీన్ వాల్ కార్బన్ సింక్ లాగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యూనియన్ "గ్రేట్ గ్రీన్ వాల్" నుంచి ప్రేరణ పొందిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత 2030 నాటికి సుమారు 25 మిలియన్ హెక్టార్ల క్షీణించిన భూమిని పునరుద్ధరించారలే లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు. దీనివల్ల దుమ్ము, కాలుష్యం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు.