విచక్షణరహితంగా విద్యార్థి కాల్పులు.. 11 మంది మృతి
ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో ఓ విద్యార్థి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
By: Tupaki Desk | 10 Jun 2025 4:57 PM ISTఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్‌లో ఓ విద్యార్థి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాలశాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
అధికారుల వివరాల ప్రకారం, గ్రాజ్ నగరంలోని ఒక హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థి ఆయుధంతో స్కూల్‌లోకి చొరబడి, రెండు తరగతుల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 30 మంది వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయురాలిపై దుండగుడు పలుమార్లు కాల్పులు జరిపాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల అనంతరం దుండగుడు స్కూల్‌లోని బాత్రూంలోకి వెళ్లి తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు అక్కడే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా దళాలను మోహరించారు.
గతంలోనూ 2015 జూన్‌లో గ్రాజ్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం జరిగిన ఈ దాడికి ఆ ఘటనే ప్రేరణ కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన ఆస్ట్రియా దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇలాంటి ఘోర ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.