Begin typing your search above and press return to search.

బంగారం, రాగి, వెండి... ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్ ఇదే!

అమెరికాకు చెందిన ఫ్రీపోర్ట్ - మెక్‌ మోరాన్ సంస్థ 1960లలో గ్రాస్‌ బర్గ్ గనిని అభివృద్ధి చేసే హక్కులు పొందింది.

By:  Tupaki Desk   |   27 July 2025 11:12 AM IST
బంగారం, రాగి, వెండి... ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్  మైన్  ఇదే!
X

ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని.. సముద్రమట్టానికి 4,100 మీటర్ల ఎత్తులో ఏర్పడిన భౌగోళికంగా అత్యంత ప్రత్యేకమైంది.. ఈ ప్రాజెక్టు వెనుక సైంటిఫిక్, బిజినెస్, స్ట్రాటజిక్ డెప్త్ కూడా ఉంది.. ఈ గని నుంచి ప్రతి ఏడాది సగటున 48 టన్నుల బంగారం, 1.8 బిలియన్ పౌండ్ల రాగిని వెలికి తీస్తున్నారు. 20 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.. ఈ స్పెషల్ బంగారు గని గురించి ఇప్పుడు తెలుసుకుందామ్..!

అవును... ఇండోనేషియాలోని ఎక్కడో మూల పర్వత ప్రాంతాలలో, సుదైమాన్ పర్వత శ్రేణిలో ఓ బంగారు గని ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా పేరు పొందింది. ఇది కేవలం బంగారంతో కాకుండా, భారీ స్థాయిలో రాగి ఉత్పత్తికి కూడా ప్రసిద్ధి చెందింది. దీనిపేరె గ్రాస్‌ బర్గ్ గని. ఇక్కడ 2023లో 52 టన్నులు బంగారాన్ని వెలికి తీసారు. ఇదే క్రమంలో... 6,80,000 టన్నులు రాగిని బయటకు తీసారు.

దీంతో పాటుగా 190 టన్నులు వెండిని కూడా ఉత్పత్తి చేశారు. ఈ లెక్కలు గ్రాస్‌ బర్గ్ గనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయి. ఈ క్రమంలో గ్రాస్‌ బర్గ్ ప్రాంతం ఒక చిన్న పట్టణంగా అభివృద్ధి చెందింది. ఈ గనిలో పని చేస్తున్న 20 వేల మందికి పైగా ఉద్యోగుల కోసం గృహ సముదాయాలు, స్కూల్లు, హాస్పిటల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ప్రత్యేక విమానాశ్రయం, ఓడరేవు కూడా ఉండటం గమనార్హం.

అమెరికాకు చెందిన ఫ్రీపోర్ట్ - మెక్‌ మోరాన్ సంస్థ 1960లలో గ్రాస్‌ బర్గ్ గనిని అభివృద్ధి చేసే హక్కులు పొందింది. ఇండోనేషియా ప్రభుత్వం సాయంతో ఈ కంపెనీ ఈ గనిని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తొలుత ఓపెన్ పిట్ మైనింగ్ ద్వారా ప్రారంభమైన ఈ బంగారు గని.. ఇప్పుడు అత్యాధునిక అండర్‌ గ్రౌండ్ మైనింగ్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తోంది. ఇక్కడ ఆధునిక సాంకేతికతలైన రిమోట్ మానిటరింగ్, బ్లాక్ కేవింగ్ పద్ధతులతో బంగారాన్ని వెలికి తీస్తున్నారు.

ఈ బంగారు గని ఓపెన్ పిట్, అండర్‌ గ్రౌండ్ మైనింగ్ విధానాల కలయికతో ఏర్పడిన అరుదైన గనిగా చరిత్రలో నిలిచిందని చెబుతారు. ఈ గనిలోని ఓపెన్ పిట్ విభాగం వ్యాసం 4 కిలోమీటర్లు, లోతు 1.2 కిలోమీటర్లుగా ఉంది. అంతటి పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ కొనసాగడంలో సహజంగానే పర్యావరణ సమస్యలు తప్పడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా... నదుల్లోకి వ్యర్థాల విడుదల, పర్యావరణ ప్రభావాలతో ఈ గని విమర్శలకు గురవుతోంది.

ఇక, ఈ గ్రాస్‌ బర్గ్ గని విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇండోనేషియా జీడీపీలో దీని ప్రాధాన్యం పెరుగుతూ వస్తోందని చెబుతున్నారు. ఈ గని దేశానికి భారీగా ఆదాయాన్ని అందించడమే కాకుండా.. వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఈ క్రమంలో... ఈ గనిని ఇండోనేషియా ఇదే విధంగా సద్వినియోగం చేసుకుంటూ వెళ్తే... ప్రపంచ బంగారం ఉత్పత్తిదారుల్లో నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని అంటున్నారు నిపుణులు.