Begin typing your search above and press return to search.

5 ఏళ్లలో 3 సార్లు భీమవరంకు పవన్... గట్టిగా తగులుకున్న గ్రంధి!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీచేయడం కన్ ఫాం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:08 AM GMT
5 ఏళ్లలో 3 సార్లు భీమవరంకు పవన్... గట్టిగా తగులుకున్న గ్రంధి!
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచి పోటీచేయడం కన్ ఫాం అని అంటున్నారు. ఈ మేరకు తాజాగా భీమవరంలో టీడీపీ నేతలను కలిసి పవన్... తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు కథనాలొచ్చాయి. దీంతో... భీమవరంలోనే పవన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతుంది. ఈ క్రమంలో తాజాగా భీమవరంలో పర్యటించిన పవన్ కల్యాణ్... అధికార పార్టీపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా విమర్శలు చేశారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ పై భీమవరం సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... అమలాపురంలో కాపులకు, శెట్టిబలిజలకూ వివాదాలు ఉన్నాయని.. ఇదే సమయంలో భీమవరంలో క్షత్రియులకు, కాపులకూ వివాదాలు ఉన్నాయని.. అదే విధంగా కృష్ణాజిల్లాల్లో కాపులకు, చౌదరీలకు వివాదాలు ఉన్నాయని చెబుతూ... ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన వివాదాలను తెరపైకి తెస్తున్నారని.. మిగిలినవారందరితోనూ కాపు కులాల వారు విభేదాలు కలిగి ఉంటారన్నట్లుగా పవన్ ప్రచారం చేస్తున్నాడని తెలిపారు.

ఈ క్రమంలో కులాల మధ్య ఉన్న విభేదాలను పెద్దగా ప్రచారంలోకి తీసుకొచ్చి పవన్ చేస్తున్న పనిమీద జగన్ పై నిందమోపుతున్నారని అన్నారు గ్రంధి శ్రీను. దీంతో... మరోసారి వివిధ ప్రాంతాల్లోని పలు సామాజికవర్గాలతో కాపులకు విభేదాలు ఉన్నాయనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

కాగా... భీమవరంలో మాట్లాడిన పవన్... కులాల మధ్య జగన్ విభేదాలు సృష్టిస్తున్నారని చెప్పడం గమనార్హం. కాపులకు శెట్టిబలిజలకు.. క్షత్రియులకు కాపులకు.. ఎస్సీలకు కాపులకూ ఇలా కులాల మధ్య విభేదాలు సృష్టించడమే జగన్ పని అని.. అలా వివిధ సామాజికవర్గ ప్రజలు కొట్టుకోవాలన్నదే జగన్ ప్లాన్ అని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో... కాపులు మిగతా కులాలవారితో గొడవలకు దిగుతారనేలా పవన్ ప్రచారం చేస్తున్నారంటూ గ్రంధి శ్రీను ఫైరయ్యారు.

ఇదే సమయంలో భీమవరంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం కోసమే పవన్ కళ్యాణ్ వచ్చారని ఆరోపించిన గ్రంధి శ్రీను... కులాల మధ్య గొడవలు సృష్టించటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో... 2019 ఎన్నికల తర్వాత పవన్ మొత్తం మీద మూడుసార్లు భీమవరం వచ్చారని ఎద్దేవా చేసిన ఆయన... భీమవరం ప్రజలు పవన్ ని మళ్ళీ షూటింగులకు పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.