Begin typing your search above and press return to search.

ప్రజారాజ్యం పదవి కోసం.. జనసేన ప్యాకేజ్ కోసం.. ఎమ్మెల్యే ఫైర్!

ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను. ఈ సందర్భంగా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ.. చిరంజీవికి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం గమనార్హం.

By:  Tupaki Desk   |   23 April 2024 4:08 AM GMT
ప్రజారాజ్యం పదవి కోసం.. జనసేన ప్యాకేజ్  కోసం.. ఎమ్మెల్యే ఫైర్!
X

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. అధికారపార్టీపై విపక్షాలు విమర్శలు చేయడం.. అనంతరం వైసీపీ నేతలు వరుసపెట్టి తలంటడం వంటి కార్యక్రమాలు రోజు రోజుకీ తీవ్రమైపోతున్నాయి! ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీను. ఈ సందర్భంగా పవన్ పై విమర్శలు గుప్పిస్తూ.. చిరంజీవికి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం గమనార్హం.

అవును... జనసేన అధినేత పవన్ పై ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినంతపనిచేశారు. ఇదే సమయంలో పవన్ చేస్తున వ్యాఖ్యలు, ఆ మాటలు మాట్లాడేటప్పుడు చేస్తున్న చేష్టలు, ఆయన వివాహ జీవితం మొదలైన విషయాలపై శ్రీను సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సమయంలో ప్రజారాజ్యం, చిరంజీవి మొదలైన విషయాలను ప్రస్థావించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో భాగంగా.. సినీ గ్లామర్‌ తో కార్లను మార్చినట్లు భార్యలను మార్చుతున్న పవన్.. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారని గ్రంధి శ్రీను ఫైరయ్యారు. పవన్‌ మానసిక స్థితి సరిగా లేదని, అందువల్ల తక్షణం మెరుగైన వైద్యం కోసం ఆయనను వైజాగ్‌ లోని పిచ్చాస్పత్రిలో చేర్పించాలని చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆయన సూచించారు. ఇదే సమయంలో... గతంలో తన తల్లిని విమర్శించిన చంద్రబాబు, లోకేష్‌ తో పవన్ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... ప్రముఖ కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన గూండాలతో జతకట్టిన పవన్‌... భీమవరంలో గూండాలు, రౌడీలు, బాంబుల అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పిన శ్రీను... ఊగిపోతూ, రెచ్చిపోతూ అతను వాడుతున్న భాషను చూస్తే రౌడీ ఎవరో ప్రజలు ఇప్పటికే గుర్తించారని చురకలంటించారు! అందువల్లనే గత ఎన్నికల్లో పవన్‌ ను భీమవరం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారని అన్నారు. అదేవిధంగా... గతంలో పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ మోడీని తిట్టిన పవన్‌.. బీజేపీతో ఎలా జతకట్టాడని ప్రశ్నిచారు.

కరోనా వైరస్‌ సమయంలో ప్రజలు అల్లాడిపోతుంటే.. పక్క రాష్ట్రానికి పారిపోయిన పవన్‌.. నేడు ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. ఈ సమయంలో ప్రజారాజ్యం టాపిక్ కూడా తెరపైకి తెచ్చిన గ్రంధి శ్రీను... చిరంజీవి స్వార్థంతో తనకు పదవి రావడం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీకి అమ్ముకుంటే.. నేడు రోజువారీ ప్యాకేజీ కోసం తన తల్లిని దూషించిన చంద్రబాబు, లోకేష్ తోనే పవన్‌ జత కట్టారని గ్రంధి శ్రీనివాస్‌ ఫైరయ్యారు.

ఈ సందర్భంగా కాపు మహిళతో పవన్ కళ్యాణ్ విఫలమైన వివాహాన్ని ఎత్తిచూపిన గ్రంధి శ్రీను... కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్‌ కు మద్దతు ఇవ్వడంపై పునరాలోచించాలని కోరారు. పవన్ కళ్యాణ్‌ తో వివాహం కారణంగా ఆమె చాలా బాధపడ్డారని నొక్కి చెప్పారు. పవన్ కళ్యాణ్ బహుళ వివాహాల గురించి గ్రంధి శ్రీను అసహ్యం వ్యక్తం చేస్తూ... పవన్ పనులన్నీ మన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధం అని పేర్కొన్నాడు.