Begin typing your search above and press return to search.

చాట్ జీపీటీ-6 ఆస్ట్రా తుఫాన్ : ఉద్యోగాలకే కాదు.. చదువులకూ పెద్ద సవాల్

జీపీటీ -6 ఆస్ట్రా అత్యంత ప్రాధాన్యత కలిగిన "ఎండ్-టు-ఎండ్" సామర్థ్యంతో పని చేస్తుంది.

By:  A.N.Kumar   |   9 Sept 2026 8:09 PM IST
చాట్ జీపీటీ-6 ఆస్ట్రా తుఫాన్ : ఉద్యోగాలకే కాదు.. చదువులకూ పెద్ద సవాల్
X

కంప్యూటర్ ముందు కూర్చుని కేవలం ప్రశ్నలకు సమాధానాలు వెతకడం.. చిన్న చిన్న కోడ్‌లు రాయడం వరకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిమితమనే రోజులకు కాలం చెల్లింది. ఓపెన్ ఏఐ తాజాగా విడుదల చేసిన జీపీటీ -6 ఆస్ట్రా మోడల్.. ఏఐ ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపింది. ఇది కేవలం ఒక సమాచార వేదిక కాదు.. ఒక సంక్లిష్టమైన పనిని అప్పగిస్తే దాన్ని అనేక దశల్లో స్వయంగా ఆలోచించి పూర్తి చేయగల శక్తివంతమైన ఏజెంట్.

ఉద్యోగ మార్కెట్‌లో ఎండ్-టు-ఎండ్ మార్పులు

జీపీటీ -6 ఆస్ట్రా అత్యంత ప్రాధాన్యత కలిగిన "ఎండ్-టు-ఎండ్" సామర్థ్యంతో పని చేస్తుంది. అంటే మనిషి ఇచ్చే ఒక చిన్న సూచన ఆధారంగా డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు తయారు చేయడం నుండి కోడింగ్, రీసెర్చ్, కంప్యూటర్ ఆపరేషన్స్ వరకు ప్రతీ పనినీ ఇది స్వయంప్రతిపత్తితో పూర్తి చేయగలదు.

ఇప్పటివరకు ఏఐ ప్రభావం కేవలం డేటా ఎంట్రీ, ప్రాథమిక కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవెల్ పనులకే పరిమితమని భావించినా.. జీపీటీ -6 ఆస్ట్రా రాకతో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, పరిశోధన, సైబర్ సెక్యూరిటీ వంటి అత్యున్నత రంగాలు కూడా ప్రభావితమవుతున్నాయి. అయితే దీని వల్ల ఉద్యోగాలు పూర్తిగా మాయమవుతాయనడం కంటే ఉద్యోగాల స్వరూపం మారుతుందనడమే నిజం.

విద్యార్థులు మారాల్సింది ఎక్కడ?

కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది ఒక పెద్ద హెచ్చరిక. ప్రాథమిక కోడింగ్ లేదా రొటీన్ పనులను ఏఐ క్షణాల్లో చేసేస్తున్నప్పుడు.. కేవలం థియరీ చదువుకే పరిమితమైతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే. విద్యార్థులు ఇప్పుడు కోడ్ ఎలా రాయాలనే దానికంటే ఏఐ ఇచ్చిన కోడ్ సరైనదేనా అని ధృవీకరించడం.. క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపడం.. సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ డిజైన్, క్రిటికల్ థింకింగ్ పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి.

సైబర్ సెక్యూరిటీలో ‘క్రిటికల్’ హెచ్చరిక

జీపీటీ -6 ఆస్ట్రా సామర్థ్యంలో అత్యంత సంచలనాత్మక అంశం దీని సైబర్ సెక్యూరిటీ స్కోరు. ఎక్స్ ప్లాయిట్ బెంచ్ పరీక్షలో జీపీటీ -6 ఆస్ట్రా ఏకంగా 100% స్కోర్ సాధించి, ఇప్పటివరకు గుర్తించని రెండు “జీరో డే వ్యూల్నేరబులిటీస్’’ ను కూడా పసిగట్టింది. దీని తీవ్రతను గుర్తించిన ఓపెన్ ఏఐ, తన ప్రైవేట్ భద్రతా నిబంధనల్లో ఆస్ట్రాను “క్రిటికల్” కేటగిరీకి మార్చి కఠినమైన భద్రతా నియంత్రణలను అమలు చేస్తోంది.

గతంలో కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా మనుషుల ఉద్యోగాలు పోతాయనే భయాలు వచ్చాయి. కానీ అవి పని విధానాన్ని మాత్రమే మార్చాయి. ఇప్పుడు ఏఐ కూడా అదే చేస్తోంది. భవిష్యత్తులో "ఏఐని వాడేవాళ్లు" కాదు.. "ఏఐతో కలిసి సమర్థవంతంగా పనిచేయగలిగే వాళ్లదే" విజయం. ఏఐతో పోటీపడటం కాకుండా దానిని ఒక శక్తివంతమైన టూల్‌గా వాడుకోవడం నేర్చుకోవడమే నేటి తరం ముందున్న ఏకైక మార్గం.