ఈ రిటైర్డ్ ఇంజినీర్ ఆస్తులకు అధికారులు షాక్... టన్నుల తేనె వెనుక..!
తాజాగా వెలుగులోకి వచ్చిన రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారాయి.
By: Tupaki Desk | 10 Oct 2025 12:42 PM ISTతాజాగా వెలుగులోకి వచ్చిన రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారాయి. అతని సంపద చూసిన అధికారులు అవాక్కయ్యారని అంటున్నారు. ఆయన ఇళ్లలోనూ, ఫామ్ హౌస్ లోనూ సోదాలు నిర్వహించిన అధికారులకు.. నోట్ల కట్టలు, బంగారం, వెండి కుప్పలు, లగ్జరీ కార్లు, ఇంకా చాలా చాలా లభించగా.. వాటితోపాటు 17 టన్నుల తేనె కనిపించడం గమనార్హం.
అవును... మధ్యప్రదేశ్ లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లోని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సంపద చూసి అధికారులే షాక్ తిన్నారని అంటున్నారు. తాజాగా లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా... ఆయన లగ్జరీ లైఫ్ స్టైల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
నలుగురు డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలోని బృందాలు భోపాల్, నర్మదాపురం అంతటా అనేక ప్రదేశాలపై దాడులు చేయగా... దిగ్భ్రాంతికరమైన స్థాయిలో సంపద బయటపడింది. ఇందులో రిటైర్డ్ పిడబ్ల్యుడి చీఫ్ ఇంజనీర్ జిపి మెహ్రా ఆస్తులు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా.. మణిపురం కాలనీలోని మెహ్రా ఇంట్లో అధికారులకు రూ.8.79 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన ఆభరణాలు లభించాయి.
ఇదే సమయంలో... రూ.56 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో... ఓపాల్ రీజెన్సీలోని అతని లగ్జరీ ఫ్లాట్ లో రూ.26 లక్షల నగదు, రూ.3 కోట్లకు పైగా విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి ఉన్నట్లు జాతీయ మీడియా నివేదించింది.
ఫామ్ హౌస్ లో కాటేజీలు, టన్నుల తేనె!:
నర్మదాపురంలో మెహ్రాకు చెందిన ఫామ్ హౌస్ కు వెళ్లిన అధికారులకు కళ్లుచెదిరే విషయాలు కనిపించాయి. ఇందులో భాగంగా... ప్రైవేటు సామ్రాజ్యాన్ని తలపించేలా ఆయన ఫామ్ హౌస్ లో ఏడు అధునాతన కాటేజీలు నిర్మించగా.. మరో 32 కాటేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. మధ్యలో చెరువు, గోశాల కన్పించాయని అధికారులు వెల్లడించారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ ఫామ్ హౌస్ నుంచి 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంత తేనె ఒకే చోట లభించడంతో.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీటితో పాటు ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ కార్లు ఉన్నాయి!
ఇదే క్రమంలో... లోకాయుక్త అధికారులు భోపాల్ లోని గోవింద్ పురా ప్రాంతంలో ఉన్న పైప్ ఫ్యాక్టరీలో మెహ్రా కుటుంబ సభ్యుల్లో ఒకరు భాగస్వామిగా ఉన్నట్లు కనుగొన్నారు! బ్యాంకు రికార్డులు, డిజిటల్ ఫైళ్లను ఫోరెన్సిక్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని, అది రూ.వందల కోట్లలో ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
కాగా.... 1984 బ్యాచ్ సివిల్ ఇంజనీర్ అయిన మెహ్రా.. ఫిబ్రవరి 2024లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు. తన కెరీర్ లో ఆయన పీడబ్ల్యూడీలో పలు కీలక పదవులను నిర్వహించారు.
