Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఉద్యోగులు ఎటు...వైసీపీ అప్పీల్ వెనక...!?

అప్పట్లో సీపీఎస్ రద్దు ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. కానీ అది అమలు జరగలేదు.

By:  Tupaki Desk   |   18 April 2024 11:30 PM GMT
ప్రభుత్వ ఉద్యోగులు ఎటు...వైసీపీ అప్పీల్ వెనక...!?
X

ఏపీ రాజకీయాలలో అనేక వర్గాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎవరిని అధికారంలోకి తేవాలన్న దాని మీద కొన్ని వర్గాలు అత్యంత కీలకంగా మారుతాయి. వాటిలో ప్రభుత్వ ఉద్యోగ వర్గం అతి పెద్ద వర్గం. లక్షలలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలుపుకుంటే భారీ ఓటు బ్యాంక్ అవుతుంది.

ఏపీలో 2024 లో ప్రభుత్వ ఉద్యోగులు స్టాండ్ ఏమిటి. వారు ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అన్నది ఇపుడు జరుగుతున్న చర్చ. ఏపీలో 2014లో చూసుకుంటే అనుభవం కలిగిన నేత విభజన ఏపీలో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయని అందోళన చెంది చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అలా అయిదేళ్ల పాటు బాబు సర్కార్ కి మద్దతుగా నిలిచారు.

అప్పట్లో సీపీఎస్ రద్దు ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్నారు. కానీ అది అమలు జరగలేదు. దాంతో 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ వంతుగా కృషి చేశారు. పాదయాత్రలో జగన్ కూడా సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారు. దాంతో మొత్తంగా వారు అంతా మద్దతు ఇచ్చారు.

అయితే వైసీపీ ప్రభుత్వ పాలనలో సీపీఎస్ రద్దు జరగలేదు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందారు. అయితే వైసీపీ ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీం ని అమలు చేసింది. అయితే తమకు పాత పెన్షన్ స్కీం కావాలనే ఉద్యోగులు అంటున్నారు. దాంతో వారు ఈ విషయం మీద వైసీపీతో విభేదిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి అటు టీడీపీ ఇటు వైసీపీ రెండూ చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే సీపీఎస్ రద్దుకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. కానీ ఉద్యోగులకి తమ ఏలుబడిలో మేలు చేస్తామని అంటోంది. ఈ నేపధ్యంలో వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ముఖంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఓపెన్ అప్పీల్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం ఎపుడూ అన్యాయం చేయలేదని ఆయన గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు కూడా చేసేవారమే కానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వల్లనే చేయలేకపోయామని అన్నారు. నిజాయతీగా ఆ విషయం చెప్పిన జగన్ గ్యారంటీ పెన్షన్ స్కీం ని పెట్టి ఉద్యోగులకు మేలు చేశారని చెప్పారు దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తరువాత వారి చివరి జీతంలో సగం పెన్షన్ రూపంలో వచ్చేలా ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి వేధింపులు లేవు అన్నది గుర్తు చేశారు. చెప్పిన మాటకు కట్టుబడి పని చేయడమే తమ ప్రభుత్వ విధానం అన్నారు. చరిత్ర తిరగేస్తే ఏకంగా రెండు లక్షల ముప్పయి వేలకు పైగా ఉద్యోగాలను అయిదేళ్ల పాలనలో అందించిన సీఎం ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరని అన్నారు.

గ్రామాల వరకూ పాలన తీసుకెళ్ళి సంస్కరణలను అమలు చేసిన ఘనత జగన్ దే అన్నారు అదే చంద్రబాబు పద్నాలుగేళ్ళ ఏలుబడిలో ఉద్యోగులకు పగలే చుక్కలు చూపించారు అని పేర్ని నాని గుర్తు చేసారు. చంద్రబాబు పాలనలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తుంచుకోవాలని అన్నారు. ఈసారి వారు అన్ని విషయాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్ని నాని కోరారు.

మొత్తం మీద చూస్తే పేర్ని నాని ద్వారా వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంలో అప్పీల్ చేసింది. మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు ఉంటారు అన్నది ఆసక్తిని పెంచుతున్న విషయంగానే చూడాలి. వారి మద్దతు ఉంటే ఎవరికైనా అధికారం సులువు అన్నది గత ఎన్నికల చరిత్ర చూస్తే తెలిసిందే.