Begin typing your search above and press return to search.

గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

తమ పనితీరుపై గవర్నర్లు చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 7:52 AM GMT
గవర్నర్  వర్సెస్  గవర్నమెంట్... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

గతకొంతకాలంగా బీజేపీపాలనయేతర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు, గవర్నర్ లకూ మధ్య సమస్యలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సమస్య ఉందనే చెప్పాలి. ఈ విషయాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, రాజ్యాంగబద్దమైన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని పలు రాష్ట్రాలు ముఖ్యంగా బీజేపీయేతర పాలిత ప్రభుత్వాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం గవర్నర్ల వ్యవహారశైలిపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... తమ పనితీరుపై గవర్నర్లు చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో... బిల్లుల ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరక ముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన కీలకమైన బిల్లుల విషయంలో గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ చర్యలు, తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. ఈ సందర్భంగా... ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదు అనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదని ధర్మాసనం హితవు పలికింది.

ఈ సందర్భంగా "వివాదం సుప్రీంకోర్టుకు చేరకముందు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి" అని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ బిల్లుల గురించి తాను శుక్రవారం వాస్తవ స్థితిని ఇస్తానని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆప్ ప్రభుత్వం అసెంబ్లీని కేవలం వాయిదా వేయడం ప్రోరోగ్ చేయకుండా ఏడాది పొడవునా సజీవంగా ఉంచుతుందని ఆరోపించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందించింది. బడ్జెట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీని సమావేశపర్చడాన్ని తప్పుబట్టింది.

కాగా... ఆర్ధిక బిల్లు సహా మొత్తం ఏడు బిల్లుల విషయమై ఆప్ సర్కారు, పంజాబ్ గవర్నర్‌ మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై భగవంత్ మాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ విషయంపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా... బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలు సుప్రీంకోర్టును ఎందుకు రావాలి? అని ప్రశ్నించిన సీజేఐ... ఇలాంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. మనది ప్రజాస్వామ్యం అని అన్నారు. ఇదే సమయంలో ఇలాంటి విషయాలను ప్రభుత్వం, గవర్నర్ పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా... ఇది గవర్నర్, సిఎం పరిష్కరించాల్సిన విషయం అని స్పష్టం చేశారు.