Begin typing your search above and press return to search.

రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయి ఏడ్చేసింది!

ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు అవినీతికి ఆశపడి పరువుతోపాటు ఉద్యోగం కూడా పోగొట్టుకుంటున్నారు

By:  Tupaki Desk   |   19 Feb 2024 2:43 PM GMT
రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయి ఏడ్చేసింది!
X

ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు అవినీతికి ఆశపడి పరువుతోపాటు ఉద్యోగం కూడా పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా జైలుపాలవుతున్నారు. గతంలో హైదరాబాద్‌ లో ఒక మహిళా తహసీల్దార్‌ అవినీతికి పాల్పడిన ఘటనలో జేఎన్టీయూలో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్న ఆమె భర్తను పోలీసులు విచారించడంతో పరువు పోయిందని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో కుంగిపోయిన షేక్‌ పేట మాజీ మహిళా తహసీల్దార్‌ గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయినా సరే కొంతమంది అధికారుల బుద్ధి మారడం లేదు.

తాజాగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు ఒక అవినీతి అధికారిణి రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయింది. దీంతో ఆమె ఏడుపు లంకించుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ లోని గిరిజన పరిపాలన భవనంలో జగ జ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గా విధులు నిర్వహిస్తోంది.

ఒక వ్యవహారంలో ఆమె సంతకం కోసం ఒక కాంట్రాక్టర్‌ జగ జ్యోతి వద్దకు వెళ్లారు. అయితే సంతకం పెట్టేందుకు ఆమె కాంట్రాక్టర్‌ నుంచి రూ. 84 వేలు లంచం డిమాండ్‌ చేసింది. దీంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు జగ జ్యోతి ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఆధారాలు బలంగా ఉండటంతో జగ జ్యోతిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

జగజ్యోతి కార్యాలయంతో పాటు ఆమె ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. అరెస్టు చేసే క్రమంలో ఆమె కన్నీరు పెట్టుకుంది.