కూటమికి... బూస్టిచ్చిన డీ'ఎస్సీ'..!
కూటమి ప్రభుత్వానికి అనూహ్యమైన బూస్ట్ వచ్చింది. వరుస నిర్ణయాలు.. ప్రణాళికల కారణంగా.. నిన్న మొన్నటి వరకుఎలా ఉన్నప్పటికీ.. వరుసగా ఈ నెలలో 15వ తేదీ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ అనూహ్యంగా పుంజుకుంది.
By: Tupaki Desk | 20 April 2025 2:14 PM ISTకూటమి ప్రభుత్వానికి అనూహ్యమైన బూస్ట్ వచ్చింది. వరుస నిర్ణయాలు.. ప్రణాళికల కారణంగా.. నిన్న మొన్నటి వరకుఎలా ఉన్నప్పటికీ.. వరుసగా ఈ నెలలో 15వ తేదీ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన గ్రాఫ్ అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఇచ్చిన ప్రకటనలు.. తీసుకున్న నిర్ణయాలు సర్కారుకు బూస్టుగా మారాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్ల వర్గీకరణ ను అమల్లోకి తీసుకురావడం.. భారీమలుపేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రూల్స్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఇది అమలుకునోచుకుంది. తద్వారా సుదీర్ఘ ఎదురు చూపులకు బ్రేక్ పడినట్టు అయింది.
ఇక, ఉచిత గ్యాస్ సిలిండర్ - 2ను కూడా.. 16వ తేదీనే ప్రకటించారు. తద్వారా.. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళల్లో జోష్ పెరిగింది. అదేవిధంగా గతంలో బకాయి ఉన్న గ్యాస్ రాయితీనిధులనుకూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది కూడా సర్కారుకు మేలు చేస్తోంది. ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. మరోవైపు.. మత్యకార భరోసా కింద.. వేట నిషేధ సమయంలో వారికి ఇస్తామన్న రూ.20 వేల హామీని కూడా నెరవేర్చుకునే విధంగా సర్కారు ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన లబ్ధిదా రుల జాబితా రెడీ అయింది. గంగపుత్రుల మోముల్లో ఇది సంతోషాన్ని నింపింది.
ఇక, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ.. సర్కారు డీఎస్సీపైనా సంచలన ప్రకటన చేసింది. శనివారం రాత్రి అనూహ్యంగా సర్కారు నుంచి వచ్చిన ప్రకటన నిరుద్యోగుల ఆశలపై పన్నీరు జల్లింది. సీఎం చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని దీనికి సంబంధించిన ప్రకటనను ఆదివారం విడుదల చేయనున్నారు. తద్వారా రాష్ట్రంలో 16 వేల పైచిలుకు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇది ఒక అసాధారణ నిర్ణయమనే చెప్పాలి. అంతేకాదు.. నిర్ణీత సమయాన్ని కూడా పెట్టుకుని దీనిని పూర్తి చేయాలని సంకల్పం చెప్పుకొన్నారు.
ఇక, యధావిధిగా పింఛన్లు పంపిణీ చేశారు. అదేసమయంలో తాజాగా డీఎస్సీ ఉద్యోగాలకు ఎస్సీ రిజర్వేషన్ను వర్గీ కరణ ప్రకారం అమలు చేయనున్నారు. అంతేకాదు.. మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయనున్నారు. తద్వారా ఆయా వర్గాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. ఇక, ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సో.. మొత్తంగా చూస్తే.. ఈ నెల 15 వరకు ఒక లెక్క.. తర్వాత.. ఐదు రోజులు మరో లెక్క అన్నట్టుగా సర్కారు ప్రకటనలు, నిర్ణయాలు.. ఒక్కసారిగా ప్రజల్లో బూమ్ పెంచాయి. మరోవైపు.. పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా పెరిగింది. ఆయన గిరిజనులకు పంపించిన చెప్పులు.. చంద్రబాబు టీసీఎస్‌కు కేటాయించిన భూములు వంటివి రాజకీయంగా ఈ వారంలో మంచి మలుపులనే అంటున్నారు పరిశీలకులు.
