Begin typing your search above and press return to search.

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ నోట‌.. `నిర్బంధం-విముక్తి`: త‌మిళిసై సంచ‌ల‌న ప్ర‌సంగం

తెలంగాణ ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర రాజ‌న్ పేర్కొన్నారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ఈ రోజు ఉద‌యం ఆమె కీల‌క ప్ర‌సంగం చేశారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 9:22 AM GMT
తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ నోట‌.. `నిర్బంధం-విముక్తి`:  త‌మిళిసై సంచ‌ల‌న ప్ర‌సంగం
X

తెలంగాణ ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌంద‌ర రాజ‌న్ పేర్కొన్నారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ఈ రోజు ఉద‌యం ఆమె కీల‌క ప్ర‌సంగం చేశారు. ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను త‌న ప్ర‌సంగంలో ప్ర‌ధానంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌స్తావించారు. రుణ మాఫీ నుంచి ఇళ్ల నిర్మాణం వ‌ర‌కు అన్ని అంశాల‌ను ఆమె స్పృశించారు. అదేస‌మ‌యంలో ప‌దేళ్ల నిర్బంధం నుంచి తెలంగాణ ప్ర‌జల‌కు విముక్తి ల‌భించింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాళోజీ యాదిలో..

ప్రజాకవి కాళోజీ నారాయ‌ణ‌రావు కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వ‌ర‌లోనే అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్లు అప్పుల్లో ఉన్నాయ‌ని తెలిపారు. 50 వేల 275 కోట్ల నష్టంలో విద్యుత్ సంస్థ కొనసాగుతుందని... పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్లు అప్పుల్లో ఉందన్నారు.

రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని తమిళిసై తెలిపారు. త్వ‌ర‌లోనే రైతుల‌కు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రుణమాఫీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చెప్పారు. ప్ర‌తి పంటకూ మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని పేర్కొన్నారు. 24 గంట‌ల పాటు విద్యుత్‌ను కూడా అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. భూమాత పోర్ట‌ల్‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు చెప్పారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు. త్వరలో శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు చెప్పారు.

గ‌త పాల‌న‌పై ఏమ‌న్నారంటే..

పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళల్లో చాలా సంస్థలు విధ్వంసానికి గురయ్యాయన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు వ్యక్తుల కోసం పనిచేసాయని తెలిపారు. కార్య నిర్వాహక వ్యవస్థలో విలువలను పునరుద్ధరిస్తామని చెప్పారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందన్నారు. అనిచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందన్నారు.

గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందన్న గ‌వ‌ర్న‌ర్.. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.