Begin typing your search above and press return to search.

చేతులు కలిపారు : గోరంట్ల కందుల ఆత్మీయ కలయిక....!

గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేరుగా కందుల ఆఫీసుకు వెళ్లి ఆత్మీయ కలయికకు తెర తీశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ మనసు విప్పి మాట్లాడుకున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2024 5:14 PM GMT
చేతులు కలిపారు : గోరంట్ల కందుల ఆత్మీయ కలయిక....!
X

రాజమండ్రి రూరల్ సీటు విషయంలో గత కొంతకాలంగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన టికెట్ పోరాటం సమసింది. సీనియర్ మోస్ట్ టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఈ టికెట్ కోసం పట్టుబట్టడంతో ఒక దశలో వివాదం కాస్తా రాష్ట్ర స్థాయిలోనే అగ్గిని రాజేసింది.

అటూ ఇటూ క్యాడర్ మోహరించారు. మా నేతకే టికెట్ అంటే మా నేతకే టికెట్ అని రెండు పార్టీల అనుచరులు అభిమానులు క్యాడర్ కూడా బిగ్ సౌండ్ చేశారు. ఇక రాష్ట్ర స్థాయిలో చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ సీటు పీట ముడిని ఎలా విప్పుతారు అని అంతా ఆసక్తిగా గమనించారు.

అయితే టీ కప్పులో తుఫాను మాదిరిగా ఇది చప్పున చల్లారిపోయింది. గోరంట్లకు రాజమండ్రి రూరల్ టికెట్ ని కేటాయించారు. అదే టైం లో కందులను నిడదవోలు వెళ్లమని జనసేన పార్టీ కోరింది. ఈ విషయంలో మొదట్లో కందుల క్యాడర్ కొంత అప్ సెట్ అయినా వారిని సహనంగా ఉండమని కందుల నచ్చచెప్పుకున్నారు.

చివరికి అంతా సర్దుమణిగాక ఆయన నిడదవోలు నుంచి తాను పోటీ చేస్తాను అని ఒక కీలక ప్రకటన చేయడంతో ఈ సీటు వివాదం ముగిసింది. ఈ నేపధ్యంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేరుగా కందుల ఆఫీసుకు వెళ్లి ఆత్మీయ కలయికకు తెర తీశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ మనసు విప్పి మాట్లాడుకున్నారు.

అనంతరం గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన రెండు పార్టీలు కలసి ఏపీలో అభివృద్ధి లేకుండా చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాయని స్పష్టం చేశారు. అప్పుల పాలు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపి రెండు పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించేందుకు తాము అంతా కలసి పని చేస్తామని ఆయన తెలిపారు.

తమ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు వమ్ము అయ్యాయని అలాగే కులాలు ప్రాంతాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా చివరికి కుదరలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక చాలా అవసరం అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ జనసేన పొత్తు చారిత్రక అవసరం అని కూడా అన్నారు.

తమ పార్టీల పొత్తును చిత్తు చేయడం వైసీపీ వల్ల కానే కాదు అని ఆయన స్పష్టం చేశారు. పొత్తు పెట్టుకోవడం వెనక రెండు పార్టీల స్వార్ధ రాజకీయాలు ఏ మాత్రం లేవని, ప్రజల సంక్షేమమే ఉందని ఆయన అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంఖ్సేమమే తమ రెండు పార్టీల అంతిమ లక్ష్యమని గోరంట్ల చెప్పారు. రెండు పార్టీలు కలసి సాఫీగా ముందుకు సాగుతాయని విజయం సాధిస్తాయని ఆయన చెప్పడం విశేషం.

ఇక తన ఆఫీసుకు వచ్చిన గోరంట్లను కందుల దుర్గేష్ కూడా మర్యాద చేసి గౌరవించారు. దీంతో రెండు పార్టీల మధ్య సామరస్యం అలాగే ఉందని, సహకారం కూడా కొనసాగుతుందని క్యాడర్ కి ఒక సందేశం ఇచ్చినట్లు అయింది.