Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దెబ్బకు 11 మంది పోలీసు ఆఫీసర్లు బలి

అధికారంలో ఉన్నా.. లేకున్నా ఒకేలాంటి హవా నడపటం అందరు రాజకీయ నేతలకు సాధ్యం కాదు.

By:  Tupaki Desk   |   13 April 2025 12:02 PM IST
Guntur Police Face Music After Escort Fiasco
X

అధికారంలో ఉన్నా.. లేకున్నా ఒకేలాంటి హవా నడపటం అందరు రాజకీయ నేతలకు సాధ్యం కాదు. ఈ విషయంలో వైసీపీ నేతల లెక్కే వేరన్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో కొమ్ములు తిరిగిన టీడీపీ నేతలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయన్నది తెలిసిందే. పోలీసులు సైతం వారి విషయంలో ఎలాంటి తీరును ప్రదర్శించింది చూశారు. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో పోలీసుల తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.

పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన ఉదంతంలో నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హవా ఎంతన్న విషయంలో తాజాగా వెలుగు చూసి హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు కోర్టులో హాజరు పర్చేందుకు వీలుగా మాధవ్ ను పోలీసులు తీసుకెళ్లే సమయంలో అక్కడ ఆయన వేరే వారి ఫోన్ తీసుకొని మాట్లాడినా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం గమనార్హం.

ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. పోలీసుల తీరును పలువురు వేలెత్తి చూపిన పరిస్థితి. కోర్టు వద్ద కూడా పోలీసు వాహనంలో నుంచి దిగి నేరుగా కోర్టులోకి వెళ్లిపోయిన వైనంతో పాటు.. ఆయనకు బందోబస్తుగా వ్యవహరించిన పోలీసుల తీరుపైనా ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారు. పోలీసుల వైఫల్యంతోనే.. కోర్టు వద్ద మాధవ్ కు వేరే వారు వచ్చి ఫోన్ ఇవ్వగా.. అక్కడ విధుల్లో ఉన్న ఏ పోలీసు కానీ ఉన్నతాధికారులు కానీ అభ్యంతరం వ్యక్తం చెప్పకపోవటాన్ని తీవ్రమైన తప్పుగా పరిణగిస్తూ శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు.

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఎస్కార్టుగా ఉన్న 11 మంది పోలీసులపైనా తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా అంతర్గత విచారణలో తేలింది. దీంతో 11 మందిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోరంట్ల మాధవ్ పుణ్యమా అని సస్పెన్షన్ దెబ్బ భారీగానే పడిందన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇప్పటికైనా విధి నిర్వహణలో కేర్ ఫుల్ గా ఉండాలే తప్పించి.. రాజకీయ నాయకులకున్న ఇమేజ్ ను పట్టుకొని వ్యవహరిస్తే.. శాఖాపరమైన చర్యలు ఉంటాయన్న సందేశాన్ని తాజా ఎపిసోడ్ స్పష్టం చేసిందని చెప్పాలి.