ఇరుక్కున్న గోరంట్ల మాధవ్.. వైసీపీ మాజీ ఎంపీ అనూహ్య అరెస్టు!
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పోలీసుల సమక్షంలోనే మాధవ్ దాడి చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు
By: Tupaki Desk | 10 April 2025 10:50 PM ISTవైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనూహ్యంగా అరెస్టు అయ్యారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పోలీసుల సమక్షంలోనే మాధవ్ దాడి చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
హిందుపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త, యూట్యూబర్ చేబ్రోలు కిరణ్ అలియాస్ కామన్ మ్యాన్ కిరణ్ పై దాడి చేయడంతో మాధవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన యూట్యూబర్ కిరణ్.. వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఐటీడీపీలో పనిచేస్తున్న కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. నైతిక విలువలు పాటించాలని తమ కార్యకర్తలను పదేపదే సూచిస్తున్న సీఎం చంద్రబాబు.. వైఎస్ భారతిపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా అతడి అరెస్టుకు ఆదేశించారు.
దీంతో గుంటూరులో ఆయనపై కేసు నమోదు చేయగా, సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనంతపురం నుంచి గుంటూరు వచ్చి పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పై దాడి చేశారు. పోలీసు వాహనం నుంచి కిరణ్ ను కిందకి లాగి ఆయన కడుపులో కాలితో తన్నినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ హఠాత్ పరిణామానికి షాక్ తిన్న గుంటూరు పోలీసులు మాజీ ఎంపీ గోరంట్లను కూడా అరెస్టు చేశారు. ఆ వెంటనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఒకవైపు కిరణ్, మరోవైపు గోరంట్ల ఉన్నారు.
పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ ను ఏ వాహనంలో తరలిస్తున్నారు? ఏ సమయానికి ఎస్పీ కార్యాలయానికి తీసుకువస్తారన్న పక్కా సమాచారంతో మాజీ ఎంపీ గోరంట్ల ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై దాడికి దిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు అరెస్టుచేసిన కిరణ్ ను తరలించడంపై ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారనేది పోలీసులు అరా తీస్తున్నారు. ప్రభుత్వం ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నా, తమ అభిమాన నేత భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే కిరణ్ పై దాడి చేసినట్లు మాజీ ఎంపీ గోరంట్ల పోలీసులకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.. స్టేషన్ బెయిల్ ఇస్తారా? లేక రిమాండుకు తరలిస్తారా? అన్నది టెన్షన్ పెడుతోంది. మాజీ ఎంపీ గోరంట్ల తోపాటు ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ఒకేచోట ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
